ప్రుష్ట తాడనాత్ దంత భంగ: అని సామెత. వీపు మీద తంతే మూతి పళ్లు రాలుతాయని దాని భావం. ఎక్కడో ఒక పని చేస్తే దాని తాలూకు ఫలితం మరెక్కడో కనిపించడమే ఈ సామెతకు అర్థం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఈ సిద్ధాంతాన్నే నమ్ముకుని... ఎర్ర చందనం దొంగలను ఓ చూపు చూస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించి.. కీలక నిందితులను, తెర వెనుక సూత్రధారులను పట్టుకోగలిగితే.... వారిద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉండే పేరు ప్రతిష్ట లను సమాధి చేసేయవచ్చునన తెలుగుదేశం పార్టీ ఉవ్విళ్లూరుతోంది.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో


ప్రధానంగా చిత్తూరు , కొంతమేరకు నెల్లూరు, కడప జిల్లాలనుంచి తమిళనాడు మీదుగా ఎర్రచందనం అక్రమ రవాణా అనేది కొన్ని సంవత్సరాలుగా శ్రుతి మించి జరుగుతూనే ఉంది. ఈ స్మగ్లింగ్ రాజకీయ అండదండలు లేకుండా జరిగే వ్యవహారం అనుకోవడం భ్రమ.  కాకపోతే.. గత పదేళ్లుగా కాంగ్రెసు పార్టీనే అధికారంలో ఉన్నది. అధికార పార్టీ అండదండలు ఉంటే తప్ప అక్రమ వ్యవహారాలు నడవ్వు. ఆ రకంగా ఆ పార్టీలోని..  ఈ జిల్లాలకు చెందిన అనేకమంది నాయకులకు స్మగ్లర్లతో దగ్గరి అనుబంధాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టుకొచ్చిన తరువాత.. ఈ జిల్లాల్లో ఆ పార్టీ ఎంత బలంగా ఉన్నదో అందరికీ తెలుసు.  ఆ క్రమంలోనే.. గతంలో స్మగ్లర్లతో సంబంధాలు ఉన్న నాయకులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా సహజంగా తొలినుంచి ఉంటూ వచ్చారు. పైగా ఇది కొత్తగా కనిపెట్టి తెలుసుకోవాల్సిన విషయం కూడా కాదు. బహిరంగ రహస్యమే. చిత్తూరు జిల్లాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెడితే... చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వయంగా వెళ్లి పలకరించి వచ్చారు కూడా. పరిచయం లేదని అనడానికి వీల్లేదు. వైకాపా నాయకులకు స్మగ్లర్లు తెలిసి ఉండడం వేరు... స్మగ్లింగ్ లోనే వారి పాత్ర ఉండడం వేరు. సరిగ్గా ఇక్కడే తెలుగుదేశం పార్టీ ఆత్రుత ప్రదర్శిస్తోంది.


చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు


ఆ రెండో విషయాన్ని నిరూపించాలని ఉత్సుకత చూపిస్తోంది. అక్కడ మారిషస్ లో దొరికిపోయిన కీలక స్మగ్లర్, చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు ను కూడా మోస్తున్న నేరగాడు గంగిరెడ్డిని స్వదేశానికి తీసుకురావడంలో.. ఏపీ సర్కారు వారి చేతగానితనం స్పష్టంగా బయటపడిపోతున్నది. అయితే దొరుకుతున్న స్మగ్లర్ల ద్వారా... చిత్తూరు కడప జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది పేర్లు తమకు సమాచారం అందుతున్నట్లుగా ప్రభుత్వాధికారులు మీడియాకు లీక్ చేస్తున్నారు. మొత్తానికి స్మగ్లర్ల ద్వరా ఆధారాలు సహా రాజకీయ ప్రత్యర్థులను ఎర్ర చందనం కేసుల్లో ఇరికించడం ఎప్పటికి కుదురుతుందో గానీ.. ఆలోగా... వీలైనంతగా ప్రజల అనుమానాలను వైకాపా మీదికి మళ్లించడానికి తెలుగుదేశం ప్రభుత్వం తపన పడిపోతున్నట్లుగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: