కొత్తగా తన కోటరీగా ఉపయోగపడగల కార్పొరేట్ శక్తులకే తప్ప... కష్టపడి పార్టీ కోసం పనిచేసిన... కార్యకర్తలకు కూడా దోచిపెట్టడం.. వారిని కాస్త సంపాదించుకోనివ్వడం.. బాగుపడనివ్వడం.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇష్టం ఉండదని.. ఆయనంటే కిట్టని వారు అంటుంటారు. అందులో నిజానిజాలు.. ఆయనతో వ్యక్తిగత అనుభవం ఉండే పార్టీ వారికే తెలియాలి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. చెప్పుకోడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది గానీ.. నాలుగు డబ్బులు కళ్లజూసేలా ఒక్క పనీ తమకు దక్కడం లేదని పార్టీ నాయకులు, చివరికి ఎమ్మెల్యేలు కూడా వాపోతున్నారట. ఈ పాలన కంటె.. గతంలో సర్కారే బాగుండేదని.. ఎవరి కమిషన్లు వారికి ఇచ్చేస్తే.. ఎంచక్కా మనకూ నాలుగు డబ్బులు మిగులుతుండేవని అంటున్నారట. అసలే వారి సొంత పార్టీ వారు ఇలా కునారిల్లుతోంటే... చంద్రబాబు కోటరీలోని ఓ మంత్రిగారు నా జమానాలో అంతా నా ఇష్టం.. నేను గెలవడానికి సహకరించిన ఎక్స్ పార్టీ వాళ్లకు కూడా నిధులు దోచిపెట్టాల్సిందే.. ఏం చేస్తారో చేసుకోండి.. అంటూ తెగేసి అంటున్నారట.


ఇదంతా పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు సంబంధించిన వ్యవహారం. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఆయన చాలా వెరైటీ వ్యాఖ్యానాలు చేశారు. తాను మంత్రిగా పనులు కేటాయించడంలో వ్యవహరిస్తున్న తీరు గురించి కొందరు కార్యకర్తలు గట్టిగా నిలదీయబోతే.. నేనేమీ కేవలం తెలుగుదేశం వారి ఓట్లతో గెలవలేదు.. అంటూ మంత్రిగారు కౌంటర్ ఎటాక్ కు తగులుకున్నారు. నేను ఎన్నికల్లో గెలవలేను అనే సంగతి నాకు ముందుగానే అర్థమైపోయింది. అందుకే... ప్రతిపక్షాల్లోని 20 మందిని నాకు అనుకూలంగా మార్చుకున్నాను. ఇలా మార్చుకోవడం కోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. వారంతా తలో చెయ్యి వేస్తేనే నేను గెలిచాను. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత.. వారందరికీ కూడా నేను ప్రత్యుపకారం చేయాల్సిందే కదా అంటూ అయ్యన్న లాజిక్ లు మాట్లాడుతున్నారుట.


ఎజెండాతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు


అసలే ప్రతిపక్షాలను అడుగంటా తొక్కేయాలనే ఎజెండాతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తనవంతు రాజకీయాలను తాను నడుపుతోంటే.. ఆయనకు పుండు మీద కారం రాసినంత మంట కలిగించేలా.. నేను మాత్రం ప్రతిపక్షాల వారికి కూడా పనులు ఇవ్వడం తప్పదు అంటూ అయ్యన్న మాట్లాడడం వివాదంగా మారుతుందేమోనని పలువురు అనుమానిస్తున్నారు. అసలే ఇప్పటికే రాజకీయంగా తన సొంత పార్టీలోని వారితోనే రకరకాల వివాదాలతో నిత్యం సతమతమవుతూ ఉండే అయ్యన్నపాత్రుడు... ఇలా కొత్త చిక్కులు కొనితెచ్చుకోవడం.. అదినేత ఆగ్రహానికి గురి కావడం ఎందుకని కొందరు హితవు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: