ఒకప్పట్లో సెలబ్రిటీల పార్టీల్లో ఆయన కనిపిస్తేనే ఒక క్రేజ్‌. పేజీ త్రీ ఈవెంట్లలో ఆయన అలా వచ్చి వాలగానే.. కురచ దుస్తులు ధరించిన అమ్మాయిలు, మోడల్స్‌, హీరోయిన్స్‌ బోలెడు మంది.. ఆయన చుట్టూ బెల్లం చుట్లూ ఈగల్లా మూగేవారు. గ్లామర్‌, రొమాంటిక్‌, లిక్కర్‌, పొలిటికల్‌ ఎరీనాల్లో ఆయన ఒకప్పుడు కింగులాగా వెలిగిపోయాడు. పాపం.. ఇప్పుడు పరిస్థితులు అంతా తిరగబడినట్లుగా కనిపిస్తోంది.


విజయమాల్య.. ఈ పేరు చెబితే చాలు.. బాలీవుడ్‌ గ్లామర్‌ ప్రపంచం ఒకప్పట్లో తెగ ఆసక్తి చూపించేది. కింగ్‌ఫిషర్‌ సామ్రాజ్యాధినేతగా, కోట్లు ఖర్చుచేసి.. రొమాంటిక్‌ క్యాలెండర్లు రూపొందించే.. శృంగార పిపాసిగా ఆయనను ఈ దేశంలో ఆ రంగాల్లోని వారు గుర్తిస్తారు. అలాంటి విజయమాల్య 2003లో టిప్పుసుల్తాన్‌ ఖడ్గాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లోనే ఆయన 1.57 కోట్లకు లండన్‌లోని ఓ ప్రెవేటు వేలం కంపెనీ వారి పాటలో భారీమూల్యం చెల్లించి కొనుగోలు చేశాడు. 2004లో ఈ విషయాన్ని బయటపెట్టారు. అప్పట్లో భారతీయ సంగ్రామ వీరుల్లో ప్రఖ్యాతి ఉన్న టిప్పు సుల్తాన్‌ ఖడ్గాన్ని బ్రిటిష్‌ దేశం నుంచి తిరిగి స్వదేశానికి తీసుకువచ్చినందుకు విజయమాల్య పేరు మార్మోగిపోయింది. టిప్పుసుల్తాన్‌ శ్రీరంగపట్నం యుద్ధంలో సాహసోపేతమైన చారిత్రాత్మక యుద్ధవిన్యాసాలకు సంబంధించిన ఖడ్గం అది. ఆయన మరణం తర్వాత అనేకానేక భారతీయ సంపదలతో పాటు అది కూడా బ్రిటిష్‌ దేశానికి వెళ్లిపోయింది. దాన్ని తిరిగి వేలంలో కొన్నందుకు అందరూ మాల్యను అభినందించారు.
అయితే.. ఇప్పుడు, విజయమాల్య ఆర్థిక పరిస్థితులు పూర్తిగా తలకిందులు అయిపోయి ఉన్నాయి. ఆయన కింగ్‌ఫిషర్‌ విమాన సంస్థ కుదేలైపోయిన తర్వాత.. మొత్తం ఆయన ఆర్థిక మూలాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆర్థిక కోణాల్లోంచి.. విజయమాల్య ఒక ముగిసిపోయిన చరిత్ర లాగా మారిపోయారు. అయితే తాజాగా ఆయన తన వద్ద ఉన్న అపురూపమైన సంపద టిప్పుసుల్తాన్‌ ఖడ్గాన్ని తిరిగి అమ్మేసుకున్నారా? అనే అనుమానం కూడా కలుగుతున్నది. 


ఎందుకంటే.. తాజాగా లండన్‌కు చెందిన బోన్‌హ్యామ్స్‌ సంస్థ నిర్వహించిన ఓ వేలం పాటలో టిప్పుసుల్తాన్‌ ఖడ్గాన్ని సుమారు 20.5 కోట్ల రూపాయలకు వేలం వేశారు. ఇంకా టిప్పు వాడిన ఆయుధాల కింద అనేక ఆయుధాల్ని మొత్తం 57 కోట్ల రూపాయలకు విక్రయించారు. అయితే ఇది టిప్పు సుల్తాన్‌ ఉపయోగించిన మరో ఖడ్గం అని కూడా కొందరు అంటున్నారు. విజయమాల్య గనుక.. దాన్ని అమ్ముకోకుండా ఉన్నట్లయితే.. ఇది నిజంగానే మరొక టిప్పు సుల్తాన్‌ ఖడ్గమో.. లేదా.. అలా పేరు పెట్టి.. ఎటూ 200 ఏళ్ల కిందటి ఖడ్గం గురించి ధ్రువీకరించేవారు ఉండరు గానుక.. వేలం సంస్థ బురిడీ కొట్టిస్తున్నదో తెలియదు. ప్రజల్లో సందిగ్ధత రాకుండా ఉండాలంటే.. తాను కొన్న చారిత్రాత్మకమైన టిప్పుసుల్తాన్‌ ఖడ్గం తనవద్దనే ఉన్నదని.. విజయమాల్య ఒకసారి చాటిచెబితే బాగుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: