కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్లుగా అవుతున్నది పరిస్థితి. బంగారు తెలంగాణ దిశగా.. భాగ్యనగరం రూపురేఖలు మార్చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చేయదలచుకున్నా కూడా..  అది ఆదిపర్వంలోనే బెడిసి కొడుతోంది. ఆయన తన కలలుగా అభివర్ణిస్తున్న అనేక అంశాలు... ఇప్పట్లో కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. తెలంగాణ సెక్రటేరియేట్‌ను ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రి ప్రాంగణానికి తరలించే ప్రాజెక్టు కూడా అటకెక్కినట్లే కనిపిస్తున్నది. 


కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే.. ఆయనకు బంగారు తెలంగాణ నిర్మాణం అనే స్వప్నం ఏర్పడిరది. అందులో భాగంగా.. ఆయన వాస్తు లెక్కలు చూపించడం ప్రారంభించారు. ఆయన అధికార గృహానికి బోలెడు వాస్తు మార్పు చేర్పులు చేయించారు. ఆయన సచివాలయ కార్యాలయానికి బోలెడు మార్పు చేర్పులు చేయించారు. ఇదేమాదిరిగా.. వాస్తు బాగాలేదు అనే భయంతో.. ఏకంగా సచివాలయాన్నే ఉన్న ప్రాంతంనుంచి ఎర్రగడ్డకు మార్చేయడానికి డిసైడ్‌ అయ్యారు. హైదరాబాదును పాలించిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఘనతను చెప్పుకోడానికి కొన్ని నిర్మాణాలు ఉన్నాయని.. తన ఖాతాలో కొత్త సెక్రటేరియేట్‌ అయినా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ఇదంతా చేస్తున్నట్లు కూడా కొందరు అనుకున్నారు. అయితే ప్రస్తుతం సెక్రటేరియేట్‌ ఉన్న ప్రాంతాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు ధారదత్తం చేయడానికే ఈ ప్రయత్నం.. అన్నవారే ఎక్కువ. 


కేసీఆర్‌ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం


ఏది ఏమైనప్పటికీ.. ఎర్రగడ్డకు సచివాలయం మార్చాలనే ఆలోచన కార్యరూపందాల్చేలా కనిపించడం లేదు. ఇక్కడ బహుళఅంతస్తుల భవనాలు కట్టడానికి పౌరవిమానయానశాఖ అభ్యంతరం చెబుతున్నదిట. అంటే ఇక అక్కడ కట్టడం అసాధ్యం. అయితే సికింద్రాబాద్‌లోని బైసన్‌ గ్రౌండ్‌, జింఖానా గ్రౌండ్‌ లలో నిర్మించాలని  కేసీఆర్‌ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇది అంత సులభమైన విషయం కాదు. ఆ స్థలాలు కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నాయి. రక్షణ శాఖ ఆధీనంలోని వాటిని రాష్ట్ర అవసరాలకోసం తీసుకోవడం అనేది చాలా కష్టం. కేసీఆర్‌ చెప్పిన రెండున్నర వేల ఎకరాల ఫిలిం సిటీ కూడా ఇదే కారణాల మీద అటకెక్కినట్లు అనుకోవాలి. ప్రస్తుతం రక్షణశాఖ మైదానాల్ని స్వాధీనం చేసుకోవడానికి కేసీఆర్‌ కేంద్రాన్ని కలవాలని అనుకుంటున్నారుట. 


అయితే వారితో వ్యవహారాలు ఒక పట్టాన తెమిలేవి కాదు. కేసీఆర్‌ ఎంత గట్టిగా ప్రయత్నాలు చేసినా.. కనీసం అయిదేళ్లలోగా నిర్ణయం వచ్చే అవకాశం ఉండకపోవచ్చునని అంటున్న వారు కూడా ఉన్నారు. ఈలోగా ప్రభుత్వాలే మారిపోతే గనుక.. ఇక ఎప్పటికీ.. సచివాలయ మార్పు అనేది జరగకపోవచ్చుననే సందేహం కూడా పలువురిలో ఉంది. కాబట్టి.. కేసీఆర్‌ చెప్పిన విషయాల్లో ఒక కీలకాంశం అయిన సచివాలయ మార్పు అనేది అటకెక్కినట్లే అని పలువురు అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: