తెలంగాణ కళల ప్రదర్శన వేదికగా నిలిచేందుకు భారీ స్థాయిలో కళాభారతి నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో దీన్ని ఏర్పాటు చేయాలని డిసైడయ్యారు. 3000 మంది కూర్చునే సామర్థ్యం గల ఒక ఆడిటోరియం, 1500 మంది కూర్చునేలా రెండు ఆడిటోరియాలు, 500 మంది కూర్చునేలా మరో ఆడిటోరియం ఇందులో నిర్మిస్తారు. 
 


అత్యాధునిక థియేటర్, ప్రివ్యూ థియేటర్, కళాకారులకు శిక్షణ, రిహార్సల్స్ కోసం ప్రత్యేక హాళ్లు, గ్రంథాలయం, ఆర్ట్ మ్యూజియం, గ్యాలరీ, చిత్రకళా ప్రదర్శన మందిరం, శిల్ప మందిరం, వీఐపీ, మీడియా లాంజులు ఉంటాయి. మూడు ప్రత్యేక సెమినార్ హాళ్లు, డార్మిటరీ, అతిథి గృహాలు, మూడు రెస్టారెంట్లు, 40 గదులు, 10 సూట్లు, పెద్ద భోజన శాల ఉంటుంది. లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాటమీలు, వాటి కార్యాలయాలు ఉంటాయి. చల్లదనం ఇచ్చే నీటి కొలనులు, ఫౌంటేన్లు, పచ్చిక బయళ్లు ఉంటాయి. 

14 ఎకరాల్లో నిర్మించనున్న కళాభారతి భవన నమూనాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర కూడా వేశారు. భవన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తారట. ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నిర్మాణ నమూనాను కేసీఆర్ ఓకే చేశారు. ఎన్టీఆర్‌ స్టేడియం స్థలాన్ని కళాభారతి నిర్మాణం కోసం సాంస్కృతిక శాఖకు బదలాయిస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చేసింది. 


ఐతే.. ఎన్డీఆర్ స్టేడియంలో తెలంగాణ కళాభారతి ఆడిటోరియంను నిర్మించొద్దని బీజేపీ, సీపీఐ, లోక్ సత్తా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం కె. లక్ష్మణ్, కె. నారాయణ, జయప్రకాశ్ నారాయణ ఎన్టీఆర్ స్టేడియాన్ని సందర్శించారు. ఆట మైదానాన్ని ఆడిటోరియం చేయడం సబబుకాదన్నారు. జేపీ ఇంకో అడుగు ముందుకేసి కేసీఆర్ పై ఘాటు పదజాలం ప్రయోగించారు. కేసీఆర్ ప్రతిపక్షాలను సంప్రదించకుండా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారనన్నారు. అంతే కాదు.. సీఎం పదవి కేసీఆర్ కు పిచ్చోడి చేతిలో రాయిగా మారిందని కామెంట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: