‘నువ్వు రాజీనామా చేస్తావా.. నువ్వు రాజీనామా చేస్తావా’ అంటూ ఇద్దరు సీనియర్‌ నాయకులు సవాళ్లు విసురుకున్నారు. బాగానే ఉంది. కానీ తీరా ఆ సవాళ్లను స్వీకరించాల్సి వచ్చేసరికి.. చంద్రబాబు నమ్ముకున్న తెలుగుతమ్ముడు మాత్రం ఓ మెలిక పెడుతున్నాడు. నిజానికి రాజకీయ రంగంలో.. సవాళ్లకు విలువలేదు. ఈ విషయంలో వారు మాట తప్పినంతగా మరే రంగంలోనూ మాట తప్పడం అంటూ ఉండదు. అయినా సరే.. సవాలును స్వీకరించడానికి తెలుగు తమ్ముడు మెలిక పెడుతున్నాడంటే భయపడుతున్నట్లే అనుకోవాలా?


ప్రస్తుతం పరిస్థితి చూస్తే అలాగే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీనుంచి ఒక్కొక్కరుగా నలుగురు ఎమ్మెల్యేలు జారుకోవడం.. ఆ పార్టీ నేతలకు విపరీతమైన అసహనాన్ని కలిగించడం సహజం. ఈ నేపథ్యంలో ఫ్లోర్‌లీడర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు... చాలా సందర్భాల్లో ఇలాంటి ఫిరాయింపుదార్ల మీద విరుచుకుపడుతూనే ఉన్నారు. పార్టీని వీడే నాయకులు దమ్ముంటే రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలంటూ సవాళ్లు విసురుతున్నారు. ఆయన ఫోకస్‌ ప్రత్యేకంగా సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ మీదే అన్నది స్పష్టం. వారిద్దరి మధ్య చాలా పెద్ద మాటల యుద్ధమే జరిగింది. మళ్లీ పోటీకి తాను సిద్ధమే అని.. తాను గెలిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, రాజీనామాకు ఎర్రబెల్లి సిద్ధమేనా అంటూ తలసాని కూడా ప్రతిసవాలు విసిరారు. నిజానికి ఈ మాటలకు విలువ లేదు. ఎందుకంటే ఆయన రాజీనామా ఆమోదమో పొందలేదు. ఉప ఎన్నిక జరిగే వాతావరణమే లేదు. అయినా ఆయన ఏదో మర్యాదకోసం సవాలు విసిరారు.


కనీసం ఈ మొక్కుబడి సవాలును స్వీకరించడానికి కూడా తెదేపా నేతకు ధైర్యం చాలినట్టు లేదు. ఇప్పుడు ఆయన కొత్త మెలిక పెడుతున్నారు. ఆ సవాలును నేను స్వీకరిస్తా.. తెరాసలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలూ రాజీనామాలు చేసి.. నలుగురూ మళ్లీ గెలిస్తే గనుక.. నేను రాజీనామా చేస్తా అంటున్నారు. అదెలాసాధ్యం. ఆయన తలసానితో ముఖాముఖి తలపడిన రేంజిలో విమర్శలు ప్రతివిమర్శలు గుప్పించుకున్నప్పుడు.. అంతవరకే పరిమితం కావాలి గానీ.. మిగిలిన వారందరినీ రాజీనామా చేసి గెలవాలని మెలిక పెడితే.. ఇక ఈ వివాదం ఎప్పటికీ ఒక  కొలిక్కి వచ్చేది కాదు లెమ్మని విశ్లేషకులు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: