ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోడీ ఇద్దరికీ కూడా ఒక విషయంలో మాత్రం సారూప్యత కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. తమ తమ బృందాలను వెంటబెట్టుకుని విచ్చలవిడిగా విదేశీ టూర్లు చేయడంలో వీరు శృతిమించిపోతున్నారు. చంద్రబాబునాయుడు చైనా నుంచి తిరిగి వచ్చి వారం రోజులు కూడా అయినట్లు లేదు. అప్పుడే ఆయన మరో విదేశీ యాత్రకు సిద్ధమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. 


చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారించేస్తానంటూ తొలినుంచి చాలా ఘాటుగా సెలవిస్తున్నారు. ఆయన ఒక్కొక్క దేశానికి వెళ్లి రావడమూ.. అక్కడి పారిశ్రామిక వేత్తలందరూ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉవ్విళ్లూరిపోతున్నారని సెలవివ్వడమూ మాత్రమే జరుగుతోంది. అంతకుపమించి నిర్దిష్టమైన ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇప్పటివరకు ఆయన విదేశీటూర్ల వలన ఎందరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డారో లెక్క తేలలేదు. ఏది ఏమైనప్పటికీ ఆయన విదేశీ యాత్రలు మాత్రం నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి. అసలే ఉత్పాదక రంగంలో మరో దేశం వైపు చూడాల్సిన అవసరంకూడా లేని స్థితిలో ఉన్న చైనాకు కూడా వెళ్లి.. అక్కడివాళ్లు కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టేస్తారంటూ చంద్రబాబు ఏదో తనవంతుగా కొన్ని మాటలు చెప్పేశారు.


ఆయన విదేశాలనుంచి వచ్చి.. ఇంకా ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై తమ గురించి పట్టించుకుంటున్నారనే ఫీలింగు ప్రజలకు ఇంకా కలగనే లేదు. అప్పుడే ఇంకో విదేశీ యాత్రకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా హ్యూస్టన్‌ నుంచి కొందరు ప్రతినిధులు వచ్చి చంద్రబాబును కలిశారు. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా తమ హ్యూస్టన్‌ నగరం ఎలా ఎదిగిందో వారు చంద్రబాబుకు వివరించారుట. ఏపీలో వారు పెట్టుబడులు పెట్టే రంగాలను గుర్తించి.. ప్రాజెక్టు రిపోర్టులతో రావాలని చంద్రబాబు వారికి చెప్పారుట. అంతవరకు బాగానే ఉంది. మరి హ్యూస్టన్‌ ప్రతినిధులు మాత్రం.. ఓసారి తమ ప్రాంతంలో పర్యటించాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారన్న దగ్గరే ఉంది మెలిక. ఇక హ్యూస్టన్‌ పెట్టుబడులను సంచిలో పెట్టుకుని తీసుకువస్తానని సెలవిస్తూ చంద్రబాబునాయుడు... తన వెంట కొందరు వందిమాగధుల్ని వేసుకుని.. హ్యూస్టన్‌ పయనం అవుతారేమో అనిపిస్తోంది. హ్యూస్టన్‌ వాణిజ్య ప్రతినిధి బృందంతో పాటూ అక్కడి ఉపమేయర్‌ కూడా వచ్చారు. వారికి మన ప్రాంతంలో  వసతులు చూపిస్తే సరిపోయేదానికి.. పెట్టుబడులతో ముడిపెట్టి.. మళ్లీ చంద్రబాబు ఇంకా విదేశీయాత్రకు సిద్ధమైపోతాడేమోనని ప్రజలు అనుకుంటున్నారు. 


చంద్రబాబు తీరు చూస్తోంటే.. ఆయన విదేశీయాత్రకు` విదేశీయాత్రకు మధ్య... కాసేపు ఆటవిడుపుగా సెక్రటేరియేట్‌లో గడుపుతున్నట్లుగా ఉన్నదని కూడా కాస్త అతిశయమైన ఛలోక్తులు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: