ముఖస్తుతి కూడా మొహం మొత్తేలా ఉండడం అంటే ఇదే! పొగిడిరచుకున్న వాడు కూడా దడుచుకునేలా పొగడడం అంటే ఇదే! అవును మరి.. తెలంగాణ సర్కారులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకుంటే చాలు.. ఇక రాజ్యం తమదేనని.. ఏమైనా చెలాయించవచ్చుననే నమ్మకం చాలా మందికే ఉంటుంది. కానీ, ఆయనను ప్రసన్నం చేసుకోవడం కోసం ఏకంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌తో ఊరేగడమే విచిత్రం. 


కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే స్వప్నం సాకారం కావడానికి జరిగిన ఒక మహోద్యమానికి కీలకదశలో సారథ్యం వహించి సాఫల్యం దిశగా నడిపించిన నేత అనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. అంతమాత్రాన ఆయన ఒక్కడే తెలంగాణ సృష్టికర్త అనేయడానికి వీల్లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడం కోసం.. కేసీఆర్‌ కంటె ముందు ఆయనకంటె ఎక్కువగా పరితపించిన వారు ఎందరో ఉన్నారు. అదే తీరుగా.. బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలని.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయనకంటె ఎక్కువగా తహతహలాడుతున్న వారు కూడా అనేకులు.. అనేక రంగాల్లో ఉన్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వ పాలన పగ్గాలు ప్రస్తుతం కేసీఆర్‌ చేతుల్లో ఉన్నాయి గనుక.. ఆయన భజనచేసి ప్రాపకం పొందజూసే వారు పెద్దసంఖ్యలోనే ఉంటారు. అలాంటి వారంతా కేసీఆర్‌కు అనంతమైన క్రెడిట్‌ను కట్టబెట్టేయాలని చూస్తుండడమే చిత్రం. 


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంనుంచి కేసీఆర్‌ను రాష్ట్ర పితామహుడిగా అభివర్ణిస్తున్నవారున్నారు. ఈ స్తోత్రాల పర్వంలో ఇటీవల ఒక పత్రిక మరో అడుగు ముందుకు వేసింది. కేసీఆర్‌ను ‘మహాత్ముడి’గా అభివర్ణిస్తూ ఆయన జన్మదినం సందర్భంగా... ప్రత్యేక సంకలనాలను ప్రచురించింది. ఈ దేశానికి సంబంధించినంత వరకు ఒక్కడే మహాత్ముడు ఉన్నాడు. అయితే సదరు పత్రికాధిపతులు.. ఆ మహాత్ముడి స్థానే ఈ సరికొత్త కేసీఆర్‌ మహాత్ముడిని ప్రతిష్ఠించదలచుకున్నారో లేదా... ఆ మహాత్ముడిని తెలంగాణ ప్రజలు మరచిపోవాలని కోరుకున్నారో... తెలంగాణ ప్రాంతానికి భారతదేశపు మహాత్ముడితో సంబంధం ఏముందని అనుకున్నారో.. అలాంటి పొగడ్తలకు తెగించారు. 


తాజాగా తెరాస ప్లీనరీ బహిరంగ సభ సందర్భంగా అలాంటిదే మరో చోద్యం జరిగింది. సీఎం కేసీఆర్‌కు ఏకంగా భారతరత్న పురస్కారం ప్రకటించాలంటూ కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. వీళ్లేదో రాజకీయ భజంత్రీలు, తైనాతీలు అనుకుంటే పొరబాటే. సీఆర్పీఎఫ్‌ జవాన్లు. ప్రభుత్వ పోలీసు సర్వీసుల్లో పనిచేస్తూ.. కేసీఆర్‌ కు బాకాల్లాగా.. ఆయనకు భారతరత్న ఇవ్వాలనే ప్లకార్డులు ప్రదర్శించడం చిత్రం అనిపించింది.

భారతరత్న గురించి దేశంలో ఇప్పటికే చాలా వివాదాలు నడుస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం గురించే ఓ పెద్ద ఎపిసోడ్‌ నడుస్తోంది. పివినరసింహారావుకు ఇవ్వాలని కేసీఆర్‌ ప్రభుత్వమే ఓ తీర్మానం చేసి పంపింది. ఇప్పుడు కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకోదలచిన వారు.. ఈ గులాబీ అధినేతకే భారతరత్న కట్టబెట్టేయాలంటూ డిమాండ్‌ తెరపైకి తేవడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: