చంద్రబాబు మోనార్క్‌ అని.. ఆయన ఎవ్వరి మాటా వినరని కొందరు అంటుంటారు. కానీ చంద్రబాబు నాయుడు కార్పొరేట్ల మాట తప్ప.. పార్టీ కోసం కష్టపడేవారు.. పార్టీకోసం తమ శక్తియుక్తులు ఆస్తులు కూడా ధారపోసే వాళ్ల మాటలు పట్టించుకోరని కూడా కొందరు దెప్పిపొడుస్తుంటారు. కానీ పార్టీలో కూడా కొందరు వ్యక్తులకు మాత్రం చంద్రబాబు వద్ద విపరీతంగా హవా సాగుతుండేలా కనిపిస్తున్నది. ఎందుకంటే.. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాల మండలి కూర్పులో ఆ సంకేతం కనిపిస్తోంది. 


టీటీడీ బోర్డు సభ్యత్వం రావడం అంటే.. గతంలో దానిని ఎమ్మెల్యే పదవితో సమానంగా భావించేవారు. రానురాను.. అలా ఆ పదవిని చాలా గౌరవంగా భావించే వారి సంఖ్య పెరగడంతో పాటూ.. ఆ పదవికోసం పదుల కోట్ల రూపాయలను పార్టీకి ముడుపులుగా సమర్పించగల సంపన్నులూ ఆశపడడం మొదలైంది. టీటీడీ బోర్డు పదవి అంటే ఒకప్పుడు దాన్ని ఫక్తు భగవత్సేవగా మాత్రమే అందరూ భావించేవారు. అయితే కాలంతో పాటూ వారి పోకడలు కూడా మారాయి. టీటీడీ పదవిని అడ్డం పెట్టుకుని... వ్యక్తిగతంగా ఎదగడానికి... కోటీశ్వరులుగా మారిపోవడానికి దీనిని ఇండైరక్టుగా మార్గంగా వాడుకోవడానికి టెక్నిక్‌లు తెలిసిన వారు పెరిగిపోయారు. దీంతో ఈ పదవికోసం ఒత్తిళ్లు కూడా బాగా పెరిగిపోయాయి. మొత్తానికి... ఇప్పుడు బోర్డులో సభ్యత్వ పదవి అంటేనే... బుగ్గకారు ఒక్కటీ ఉండదు గానీ.. ఇంచుమించు మంత్రిపదవితో సమానంగా అందరూ  లెక్కవేసుకుంటున్నారు. అందుకే దానికోసం కేబినెట్‌లో చోటు దక్కని.. ఎమ్మెల్యేలు కూడా ఎగబడుతున్నారు. మరోవైపు నామినేటెడ్‌ పదవుల్ని కూడా ఎమ్మెల్యేలకే కట్టబెట్టేస్తే, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నందుకు మేమేమైపోవాలి.. అని పెదవివిరిచే నాయకులూ తయారవుతున్నారు. 


ఇన్ని గందరగోళాల  మధ్య చంద్రబాబు టీటీడీ బోర్డును ప్రకటించారు ఇందులో పార్టీనుంచి జారిపోకుండా తాయిలం ఇచ్చినట్లు ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలను, మరింకేమీ అడగొద్దన్నట్లుగా ముగ్గురు ఏపీ ఎమ్మెల్యేలను చేర్చారు. అమిత్‌షా కోటా, భాజపా కోటా, పవన్‌కల్యాణ్‌ కోటా, టాలీవుడ్‌ కోటా ఇలా కొన్ని చేర్చారు. అయితే చంద్రబాబును ఈ విషయంలో ఇన్‌ఫ్లుయెన్సు చేయడంలో మంత్రి యనమల రామకృష్ణుడు కూడా కృతకృత్యులు అయ్యారని చెప్పాలి. ఎందుకంటే.. ఇంత తీవ్రమైన పోటీ ఉన్న ఈ టీటీడీ బోర్డు పదవుల్లో యనమల రామకృష్ణుడికి సన్నిహితబంధువైన ఓ వ్యక్తికి కూడా చోటు దక్కింది. 


పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అనే వ్యక్తికి ఈ పదవి దక్కింది. ఆయన కడపజిల్లా మైదుకూరు నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అప్పట్లో ఆయనకు టిక్కెట్‌ దక్కడమే ఒక వింత కాగా, ఇప్పుడు చిత్రంగా ఓడిపోయిన వ్యక్తికి టీటీడీ బోర్డు పదవి దక్కడం ఇంకా విచిత్రంగా పార్టీలో అంతా చెప్పుకుంటున్నారు. తమాషాఏంటంటే.. బోర్డులో ఏయే సభ్యులకు ఎవరెవ్వరి ద్వారా పదవులు లభించాయో.. తెర వెనుక వ్యవహారం నడిపించిన వారి విషయాలు కూడా కొన్ని పత్రికలు రాశాయి. కానీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సంగతి వారు పేర్కొనలేదు. అయితే ఏపీహెరాల్డ్‌ ఆరా తీయడంలో.. ఆయన యనమల రామకృష్ణుడి ఆబ్లిగేషన్‌ ద్వారా దీన్ని సాధించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన యనమలకు చాలా సన్నిహితుడైన బంధువు అని.. ఆ కోటాలోనే పదవి లభించిందని తెలిసింది. మామూలుగా అయితే.. టీటీడీ కూర్పులో మంత్రులకు కోటా ఏమీ లేదుగానీ.. యనమల మాట చంద్రబాబు వద్ద ఈ పరిస్థితుల్లో వేదవాక్కులా సాగుతున్నదని.. అందుకే ఆయన మాటకు విలువిచ్చి బంధువుకు పదవి కట్టబెట్టారని అంతా చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: