హైదరాబాదు నగరం అంటేనే.. 800 ఏళ్లకు పైబడిన సుదీర్ఘమైన చరిత్ర ఉన్న నగరం. అడుగడుగునా మనకు ఓ వారసత్వ కట్టడం కనిపిస్తుంది. బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తానని టముకు వేసుకుంటున్న కేసీఆర్‌ సర్కారు.. ఇలాంటి అద్భుత వారసత్వ నిర్మాణాల్లో ఒకదానిని సమూలంగా నేలమట్టం చేసేయడానికి చాటుమాటుగా రంగంసిద్ధం చేస్తున్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 


హైదరాబాదు నగరంలో నిజాం కాలంలో నిర్మించిన అత్యద్భుతమైన నిర్మాణ కౌశలం ఉట్టిపడే భవంతులు ఇక్కడ మనకు అనేకం ఉంటాయి. నిజాం కాలంలో నవాబు గారి వద్ద పనిమనుషుల ఇళ్లు కూడా.. నగరంలో అక్కడక్కడా విస్తరించి.. ఎకరాల విస్తీర్ణంలో ఓ చిన్నసైజు మహల్స్‌లాగానే మనకు కనిపిస్తుంటాయి. వీటిలో కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం వారసత్వ సంపదకు ప్రతీకలైన చిహ్నాలుగా కూడా గుర్తించింది. సాధారణంగానే ఆ కోవలోకి చెందిన నిర్మాణాలను చాలా జాగ్రత్తగా పరిరక్షిస్తుంటారు. వాటి మెయింటెనెన్స్‌లో కూడా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ.. అలాంటి వారసత్వ నిర్మాణాలను పూర్వీకులు మనకు అందించిన సంపద లాగా కాపాడుకోవడం విధి. ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు ఆ విషయంలో వేలెత్తి చూపలేని విధంగానే వ్యవహరిస్తూ వచ్చాయి. 


కేసీఆర్‌ సర్కారు వచ్చాక సీన్‌ మెరుగుపడుతోందని అంతా అనుకున్నారు. వారసత్వ సంపదల పేరుతో అసెంబ్లీ భవనం ముందు మెట్రో మార్గం వెళ్లనివ్వకుండా కేసీఆర్‌ అడ్డు పడడంతో.. నిజానికి మెట్రో వలన అసెంబ్లీ భవనానికి ఏమాత్రం ప్రమాదం లేకపోయినప్పటికీ.. ఆ భవనాల మీద కేసీఆర్‌కు ఎంత శ్రద్ధ అని అంతా విస్తుపోయారు. ఆ తర్వాత.. అసెంబ్లీ భవనాన్ని, రవీంద్రభారతిని తదితర నిర్మాణాలను కూల్చేసి కొత్తవి కట్టించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు కొన్ని వార్తలు రావడంతో నివ్వెరపోయారు. ఆ తర్వాత ఆ వార్తలు ధ్రువపడలేదు. 


అయితే తాజాగా భాగ్యనగరంలోని ఓ అద్భుతమైన వారసత్వ నిర్మాణాన్ని మాత్రం దురదృష్టం వెన్నాడుతోంది. ఉస్మానియా హాస్పిటల్‌ ప్రస్తుతం నడుస్తున్న భవనాన్ని కూల్చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ భవనాన్ని వారసత్వ జాబితాలోంచి తొలగించాల్సిందిగా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఉత్తరం రాసిందిట. సీఎం ఓకే అంటే.. ఇక ఆ తరువాత పనులన్నీ చకచకా జరిగిపోతాయి. దాన్ని మామూలు భవనం అని గుర్తిస్తారు. అదే జరిగితే.. ఆ వెంటనే దాన్ని కూల్చేసి 24 అంతస్తుల అత్యాధునిక ఆస్పత్రి భవనం కట్టాలని అనుకుంటున్నారట. 


వారసత్వ భవనాల విషయంలో కేసీఆర్‌ ఈ నిర్లక్ష్యం ఏమిటా అని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ ఉస్మానియా ఆస్పత్రికోసం 24 అంతస్తుల అత్యాధునిక భవనం కట్టదలచుకున్నా సరే.. హైదరాబాదులో అందుకు తగిన ఖాళీ జాగాలే లేవా.. ఈ వారసత్వ భవనాన్ని కూల్చేయాల్సిందేనా..? ఆస్పత్రిని ఖాళీ చేయించి వారసత్వ భవనంగానే.. దీన్ని ప్రజలకోసం అందుబాటులో ఉంచవచ్చు కదా అని  ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు నిజాం వారసత్వాన్ని పరిరక్షిస్తా అంటూ.. మరోవైపు బంగారు తెలంగాణ నిర్మిస్తా అంటూ.. ఈ విధ్వంసపు ఆలోచనలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: