తెలుగు రాష్ట్రాల విభ‌జ‌నానంత‌రం తెలంగాణ లో మొద‌టి సారి టిడిపి నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడు. ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌ చంద్రబాబుకు సవాల్ గా మారేలా కనిపిస్తోంది. టిఆర్ఎస్ నిర్వహించిన ప్లీనరీ, ఆ తర్వాత నిర్వహించిన సభకు ధీటుగా ఏ మేరకు నిర్వహించగలుగుతాడు, అది సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్ర‌స్తుత తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్ర‌శ్న‌ర్ధకంగా మారిన త‌రుణంలో మహానాడు నిర్వహణకు ఎంచుకున్న వేదిక ఇలాంటి సందేహాలకు తావిస్తోంది.


టిడిపి బలానికి చాలా తేడా వచ్చింది


హైదరాబాద్ లో ఎప్పుడు మహానాడు నిర్వహించినా, గండిపేట వేదికగా నిర్వ‌హించారు. కానీ గతానికి ఇప్పటికి వందశాతం మార్పు వచ్చింది. గతంలో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధానే. అప్పుడు రాష్ట్రం విడిపోలేదు. ఇప్పుడు విడిపోయింది. పేరుకు ఉమ్మడి రాజధానే అయినా అది తెలంగాణకు వచ్చేసింది. అప్పటి టిడిపి బలానికి ఇప్పటి టిడిపి బలానికి చాలా తేడా వచ్చింది. అప్పుడున్నంత క్యాడర్, కార్యకర్తల బలం హైదరాబాద్ లో బాగా తగ్గింది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో టిడిపి ముఖ్యనాయకులు దాదాపు 90 శాతం ఇప్పుడు పార్టీలో లేరు. అందుకే మహానాడుకు కార్యకర్తలు, నేతల సమీకరణ ఇప్పుడు పెద్ద సవాల్ కాబోతోంది.


సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు 


తెలంగాణ టిడిపిలోని కీల‌క నాయ‌కులంతా అధికార టిఆర్ఎస్ లో చేరిపోయారు. గ‌త సంవ‌త్స‌రం అక్టోబర్ 29న టీడీపీని వీడి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాసయాదవ్‌, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ క‌లిసి గులాబీ తీర్థం తీసుకోని  గ్రేటర్ లో టీడీపీకి గ‌ట్టీ షాకే ఇచ్చారు. మ‌రో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు త‌న ముఖ్య అనుచ‌రుల‌తో గ‌త‌ సెప్టెంబర్ 05 న  కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో  ఖమ్మం లో టీడీపీ పూర్తిగా ఖాళీ ఆయ్యింది. తాజాగా  టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి త‌న టీడీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, తన అనుచరులతో కలిసి గ‌త నెల 24న జ‌రిగే పార్టీ  ప్లీనరీ స‌మావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ లోకి జంప‌య్యాడు. గ్రేటర్ ఎన్నికల నాటికి మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, మాధవరపు కృష్ణారావు కూడా గులాబీ గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఒక‌రిద్ద‌రు త‌ప్పా తెలంగాణ లో టిడిపి నామ రూపం లేకుండా పోయిందని వాస్తవం.  

 

మహానాడు కార్యక్రమంలో అయితే ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు కాబట్టి వారినెలాగో ఓ లాగా ఏపిలోని పదమూడు జిల్లాల నుంచి తరలించవచ్చు. కానీ తర్వాత నిర్వహించబోయే బహిరంగ సభనే చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది. పైగా గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్నందున హైదరాబాద్ లో బలనిరూపణకు ఇదే ప్రధాన వేదిక కాబోతోంది. టిఆర్ఎస్ అంటే దగ్గరగా ఉన్నరంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి అంటే హైదరాబాద్ సమీప ప్రాంతాల నుంచి భారీగా తరలించింది. 


టిఆర్ఎస్ కు అన్ని విధాల సహకరించారు


ఈ ప్రాంతాలలో టిఆర్ఎస్ అధికార పార్టీ కాబట్టి అన్ని విషయాలు దానికి కలిసి వచ్చాయి. హైదరాబాద్ లో పోలీసులు, ఇతర అధికారులు టిఆర్ఎస్ కు అన్ని విధాల సహకరించారు. వ్యాపారులు భారీగా ఖర్చుపెట్టుకున్నారు. టిడిపి పరిస్థితి ఏంటి.. హైదరాబాద్ లో ఓ విధంగా పరాయి పార్టీగా ముద్రపడింది. కొంత మేర కార్యకర్తల బలం ఉందని చెప్పుకుంటున్నా.. నాయకుల కొరత చాలా ఉంది. వారే లేకుంటే జనం రారన్నది అందరికి తెలిసిందే. చుట్టు పక్కల ప్రాంతాల్లో నయితే టిడిపి చాలా దెబ్బతింది. అంటే హైదరాబాద్ సమీప ప్రాంతాల నుంచి వచ్చేవారు చాలా తక్కువ అన్నమాట. 


అంటే మహానాడుకైనా, ఆతర్వాత సభకైనా జనాన్ని ఏపి నుంచి తీసుకురావాల్సిందే. అది కష్టంతో కూడుకున్న పని. టిడిపి ఉమ్మడి ఏపిలో అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో నిర్వహించిన సభలకు ఏపిలోని జిల్లాల నుంచి వచ్చిన వారు చాలా తక్కువ. ఇప్పుడయితే పరిస్తితులు బాగా మారాయి. పైగా రవాణా పన్ను కూడా ఈ సారి తరలించేవారికి తడిసిమోపెడవుతుంది. అక్కడి నుంచి వచ్చిన వారికి ఇక్కడ రాత్రి ఉండడానికి బస కచ్చితంగా ఏర్పాటు చేయాలి. కారణం దూర ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి అదే రోజు తిరిగిపోలేరు. అదే టిఆర్ఎస్ కు ఈ సమస్య ఎదురుకాలేదు. 


ఇలాంటి అవరోధాల మధ్య టిఆర్ఎస్ ప్లీనరీకి, సభకు ధీటుగా మహానాడు, బహిరంగ సభ నిర్వహించడం చంద్రబాబుకు సవాలే. అయితే చంద్రబాబు మేనేజ్ మెంట్ నిపుణుడు. ప్రస్తుతం అధికారంలో వున్నారు కాబట్టి అర్థబలానికి లోటు వుండదు. అందువల్ల ఈ సవాల్ ను అధిగమించే అవకాశం లేకపోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: