ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు ఇక ఎప్పటికీ తనకు భవిష్యత్తు ఉండబోదని క్లారిటీ వచ్చేసిన నాయకుల జాబితాలోకి పీసీసీ మాజీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ కూడా చేరిపోతున్నారు. బొత్స సకుటుంబంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోతున్నట్లుగా కొన్నాళ్లుగా వార్తలు రాజకీయవర్గాల్లో తరచూ వస్తున్నాయి. అయితే జగన్‌ నుంచి కండిషనల్‌ గ్రీన్‌సిగ్నల్‌ మాత్రమే లభించినట్లుగా తెలుస్తున్నది. 


బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చాలా చిన్నస్థాయినుంచి కీలక స్థానానికి ఎదిగిన నాయకుడు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాపకం పుష్కలంగా ఉండడం వలన బొత్స.. తన ప్రాంతంలో చాలా మంది సీనియర్‌ నాయకులను తొక్కేసుకుంటూ రాజకీయ సోపానపటంలో పైపైకి ఎగబాకారు. దీనిపై స్థానిక నాయకుల్లో చాలా మందికి ఆయన మీద కినుక కూడా ఉన్నది. ఇప్పుడు వారితో వైషమ్యాలే బొత్స సత్యనారాయణ వైకాపాలోకి రావడానికి ప్రతిబంధకంగా మారుతున్నాయి.


కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకుని ఉంటే.. ఇక భవిష్యత్తు శూన్యం అని అర్థమైన తర్వాత.. బొత్స సత్యనారాయణ తొలుత భాజపా వైపు దృష్టి సారిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రయత్నాలు ఎందుకు ముందుకు సాగలేదో తెలియదు గానీ.. మొత్తానికి ఆయన గాలి వైకాపా వైపు మళ్లింది. గతంలో వైఎస్‌ మరణం తర్వాత ఇతర సీఎంల మంత్రివర్గాల్లో ఉంటూ బొత్స పలు సందర్భాల్లో జగన్‌ మీద చాలా దారుణంగా విరుచుకుపడ్డారు. జగన్‌ అక్రమాలు దోపిడీ వలన మంత్రులంతా మాట పడాల్సి వస్తున్నదంటూ తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. అయినా సరే.. అవన్నీ పట్టించుకోకుండా జగన్‌ ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి ఒప్పుకున్నారు. అయితే సొంత పార్టీలో మాత్రం వ్యతిరేకత ఎదురైంది. 


బొత్స సామ్రాజ్యం అయిన విజయనగరం జిల్లాలో వైకాపా కీలక నాయకులు సుజయకృష్ణరంగారావు, పెన్మత్స సాంబశివరాజు తదితరులకు ఆయనతో బద్ధ వైరం ఉంది. బొత్స గనుక పార్టీలోకి వస్తే.. తాము వైకాపాను వీడి వెళతాం అంటూ వారు జగన్‌కు ఇప్పటికే అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. వారిని బుజ్జగించడానికి జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కూడా తెలుస్తోంది. 


అయితే మధ్యేమార్గంగా జగన్‌` బొత్సకు కండిషనల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. విశాఖపట్నం జిల్లా నాయకుడిగా మాత్రమే పార్టీకి సేవలందించాలని, విజయనగరం జిల్లా వ్యవహారాల్లో వేలు పెట్టకూడదని ఆయన చెప్పినట్లు పుకార్లు ఉన్నాయి. అయితే తన సామ్రాజ్యానికి తనను పూర్తిగా దూరం చేసినట్లు అవుతుందనే ఆలోచన బొత్స లో ఉన్నది. దీనివలన రెంటికి చెడ్డ రేవడిలాగా మారుతానేమో అని కూడా ఆయన అనుకుంటున్నారట. ఇలాంటి విభిన్న కారణాల నేపథ్యంలో బొత్స వైకాపా చేరిక అంత సులువుగా కార్యరూపం దాల్చే పరిస్థితి లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: