బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ కేవలం సినీరంగ సెలబ్రిటీ మాత్రమే కాదు. రాజకీయ వర్గాల్లో కూడా ఆయనకు పలువురు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఇప్పుడు ఆయనను ఆదుకునేందుకు ఉపయోగపడే అవకాశం ఉన్నదా..? పలువురిలో ఇదే చర్చనడుస్తోంది. 


ఒక రంగంలో సెలబ్రిటీ అయిన ప్రతి ఒక్కరికీ.. తతిమ్మా రంగాల్లో సెలబ్రిటీల్తో సత్సంబంధాలు అనేవి చాలా సులువుగా ఏర్పడిపోతాయి. స్పోర్ట్స్‌స్టార్‌ హీరోయిన్లతోను, పొలిటీషియన్లకు స్వామీజీలతోను సంబంధాలన్నీ ఇలాంటి కోవకు చెందుతాయి. అలాగే బాలీవుడ్‌ అగ్రహీరోలో ఒకరైన సల్మాన్‌ఖాన్‌కు పొలిటికల్‌గా కూడా బోలెడు పరిచయాలు ఉన్నాయి. గతంలో సినీరంగానికి  సంబంధం లేని ముంబాయి తాజ్‌ హోటల్‌ పేలుళ్లు వంటి సందర్భాల్లోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. దుమారం సృష్టించిన సల్మాన్‌ఖాన్‌.. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభంజనాన్ని ముందే ఊహించారో ఏమో గానీ.. ఆయన వెన్నంటి నిలిచారు. మోడీని ఓ అద్భుతనేతగా ఎన్నికలకు ముందునుంచి అభివర్ణిస్తూ.. ఆయన విజయానికి తన వంతు కృషిచేశారు. ఎన్నికలకు ముందు వారిద్దరూ కలిసి అనేక కార్యక్రమాల్లో చాలా కలివిడిగా పాల్గొన్నారు. ఇద్దరూ పరస్పరం.. ఒకరికొకరు ఫ్యాన్‌ అని చెప్పుకుంటూ మురిసిపోయారు. అది ఎన్నికల వేళ గనుక.. పైగా సల్మాన్‌ఖాన్‌ (సహజంగా భాజపాను వ్యతిరేకించే) ముస్లిం వర్గానికి చెందిన వాడు గనుక.. ఆయన నుంచి మద్దతు రావడం.. తన పార్టీకి, విజయానికి ఎంతో ఉపయోగపడుతుందని భావించారేమో... మోడీ కూడా ఆయనతో రాసుకుపూసుకు తిరిగారు. 


అలా మోడీతో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌ను కాపాడేందుకు ఉపయోగపడబోతోందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నరేంద్రమోడీ ఆశ్రిత పక్షపాతి.. ‘తనవారికోసం’  ఏమైనా చేస్తారనే ప్రచారం ఇప్పటికే రాజకీయవర్గాల్లో ఉంది. అలా.. సినీ పరిశ్రమలోనూ తన మార్కును సుస్థిరం చేసుకోదలచుకుంటే.. ఆయనకు ఇది ఒక మంచి అవకాశం కావొచ్చు. ఇప్పటికే సల్మాన్‌ తరఫు దూతలు.. ప్రధాని నరేంద్ర మోడీతో ఈ విషయమై సంప్రదించినట్లుగా పుకార్లు వస్తున్నాయి. ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా.. ఈ వ్యవహారం కోర్టు పరిధిలోనిది కావడం వలన స్వయంగా ప్రధాని చేతికి మట్టి అంటకుండా.. సల్మాన్‌ ను కాపాడడం ఎలా అనే అంశమై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. అయితే.. సల్మాన్‌ను గట్టున వేయడానికి ప్రధాని మోడీ సీరియస్‌గా పూనుకుంటారా? లేదా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. అనే స్వీపింగ్‌ డైలాగునే వారికి కూడా వినిపించి.. ఊరుకుంటారా అనేది వేచిచూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: