విభజన ద్వారా అన్యాయం జరిగిందని.. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల వారికీ ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. హోదా కోసం అందరూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. 

ఏపీకి హోదా ఇవ్వొద్దంటున్న గుత్తా..


ఐతే.. ఏపీకి హోదా ఇవ్వొద్దని ఓ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా ప్రధానికి లేఖ రాయడం ఆసక్తిరేపుతోంది. ఏకంగా పార్టీ అధ్యక్షురాలే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో అడుగుతుంటే.. ఈ కాంగ్రెస్ నేత మాత్రం ఇవ్వొద్దని ప్రధానికి లేఖ రాశాడు. ఆయనే కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. 

హోదాతో తెలంగాణకు నష్టమట


రేవులు, పరిశ్రమలు, ఇతరత్రా సౌకర్యాలకు దూరంగా ఉన్న, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారు. హిమాలయ రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలే దీనికి అర్హమైనవి. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ తగదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ సరిహద్దు ఉన్న, వెనుకబడిన రాష్ట్రమైన బిహార్‌కు విభజన తర్వాత కూడా కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించలేదని గుర్తు చేశారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే... ఇతర రాష్ట్రాలకు, మరీ ముఖ్యంగా తెలంగాణకు నష్టం జరుగుతుందని గుత్తా తన లేఖలో రాశారు. పరిశ్రమలు ఏపీకి తరలిపోయే ప్రమాదముందని చెప్పారు. గుత్తా లేఖపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఆయనకేం నష్టం అని ప్రశ్నించారు. గుత్తాపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఫిర్యాదు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: