విభజన తర్వాత ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన యంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వహస్తాలతో ప్రధానమంత్రికి వ్రాసిన లేఖ వలన ఇప్పుడు కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయింది. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగానే ఆయన చేత ఈ లేఖ వ్రాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ ఇప్పుడు ఎదురు దాడి చేయవచ్చును.


ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కాంగ్రెస్ నేతల దీక్ష


ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే ఈ అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పుడు, ఆ పార్టీ తమను ఏవిధంగా ప్రశ్నిస్తోందని బీజేపీ ఎదురు ప్రశ్న వేయవచ్చును. లేదా కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతునప్పుడు ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ ఎందుకు పోరాడుతోంది? ఒకవేళ మోడీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోతే అప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇదేవిధంగా అడ్డు తగులుతారా? అని బీజేపీ ఎదురు ప్రశ్నిస్తే కాంగ్రెస్ వద్ద సరయిన సమాధానం ఉండదు.   


ప్రత్యేక హోదాపై సంతకాల సేకరణ


మరో వైపు విభజనతో ప్రజలకు దూరమైన కాంగ్రెస్.. మళ్లీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాగా తీసుకుంది. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ రాష్ర్ట పీసీసీ నాయకత్వం గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. గతంలో ప్రత్యేక హోదా కోరుతూ.. కోటి సంతకాల కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. సోనియా గాంధీ కూడా లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు. ఏ పార్టీకైనా ఒక అంశంపై ఒక సిద్ధాంతం.. ఒక క్లారీటి ఉంటుంది. దాని కనుగుణంగానే నాయకులు నిర్ణయాలు తీసుకుని ముందుకుసాగుతారు. అంతేగానీ, ఒకే పార్టీలోని నాయకులు ఒక అంశంపై వివిధ రకాలుగా మాట్లాడడం ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులకే చెల్లుతోంది. మొత్తంగా విభజన ముందు.. ఆ తర్వాత కాంగ్రెస్‌ డ్రామా ఆడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: