నటుడు మంచు మనోజ్ పెళ్లి వేడుక సందర్భంగా ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. రాజకీయంగానూ, పత్రికాపరంగానూ ప్రత్యర్థులైన రామోజీరావు, జగన్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. చేతులు కలుపుకున్నారు. కొద్దిసేపు ముచ్చటించుకున్నారు కూడా. 

వివాహవేడుకకు జగన్ భూమన కరుణాకర్ రెడ్డి తదితరులతో కలసి వచ్చారు. వేదికపైకి వచ్చిన వేళ.. అక్కడ పారిశ్రామిక వేత్త టి.సుబ్బిరామిరెడ్డితో పాటు రామోజీరావు తన కుటుంబ సభ్యులతోపాటు కూర్చుని ఉన్నారు. జగన్ అందరికీ నమస్కారాలు చేస్తూ వచ్చారు. 

చేతులు కలిపిన జగన్ - రామోజీ..

టి.సుబ్బిరామిరెడ్డి జగన్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తర్వాత జగన్ రామోజీవైపు చూసి.. నమస్కారం చేశారు. అప్పటివరకూ కూర్చుని ఉన్న రామోజీరావు..జగన్ నమస్కారంతో లేచి నిలబడ్డారు. వయసుమీదపడటంతో ఆయన లేచేందుకు ఇబ్బందిపడ్డారు. జగన్ చేయి ఇచ్చిన ఆసరాతోనే రామోజీ లేచి నిలబడ్డారు. ఆ సమయంలో రామోజీ.. జగన్ చేతులు కలుపుకునే ఉండటం విశేషం. 

జగన్- రామోజీ మాటామంతీ.. 

నమస్కారాలు అయ్యాక.. రామోజీ, జగన్ పక్కపక్కనే ఉన్న వేరు వేరు సోఫాల్లో కూర్చున్నారు. ఎటో చూస్తున్న జగన్ తో రామోజీరావే మాటకలిపారు. ఉత్సాహంగా ముందుకు వంగిమరీ పలకరించి మాట్లాడారు. సహజంగానే సిగ్గపడే జగన్.. సిగ్గుతోనే కొద్దిసేపు రామోజీతో మాట్లాడారు. 

ఎండల్లోనూ బాగా తిరుగుతున్నారని జగన్ తో రామోజీ అన్నట్టు సమాచారం. తప్పదు కదా అని బదులిచ్చిన జగన్.. ఫిలింసిటీ ఎలా ఉందని అడిగారట. మనోజ్ పెళ్లి ప్రత్యక్ష ప్రసారం అన్ని ఛానళ్లకూ ఇచ్చారు. లైవ్ లో రామోజీ-జగన్ కలయిక, నమస్కారాలు, మాటామంతీ చూసి ఆశ్చర్యపోయిన మీడియా ప్రతినిధులు.. ఆ అరుదైన దృశ్యాలను బాక్సుల్లో ప్రత్యేకంగా చూపించి పండుగు చేసుకున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: