భానుడు ప్రచంఢరూపం దాల్చాడు. ఒక్కసారిగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాలు మండిపోతున్నాయి. ఎండతీవ్రతను తట్టుకోలేక మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఉదయం 9 గంటల లోపే 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మిట్టమధ్యాహ్నం సమయానికి అదికాస్తా అత్యధికంగా 47 డిగ్రీలకు చేరి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. కొద్దిరోజులుగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు తోడవడంతో ఉభయ రాష్ట్రాలలోని ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రోజు గడుపుతున్నారు. రోహిణీ కార్తె ఆరంభంతో పాటుగా, వేర్వేరు కారణాల రీత్యా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు ఇప్పుడు ఇంకొంత భయాన్ని కలిగిస్తున్నాయి.

ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల వరకూ పెరిగిపోయాయి


వచ్చే వారం రోజులూ మండు వేసవిని నిండుగా చూడబోతున్నాం. నిప్పుల కొలిమిలో మాడిపోబోతున్నాం. ఇప్పటికే ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల వరకూ పెరిగిపోయాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టిస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు చెమటలు పట్టిస్తున్నాయి. ఆదివారం మర్నాటి నుంచి ఆరంభమయ్యే రోహిణీ కార్తె ఎలాగూ ఉండనే ఉంది. వాయవ్య, ఉత్తర పొడిగాలులు ఉష్ణోగ్రతలను పెంచేస్తుంటే, ఛత్తీస్‌గఢ్‌ నుంచి తమిళనాడు వరకూ ఏర్పడిన అల్పపీడన ద్రోణి అగ్నికి ఆజ్యం పోస్తున్నది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఈ మారు తక్కువేనని తేలిపోయినా, అవి అనుకున్న సమయానికే వస్తున్నందుకు సంతోషం కలుగుతున్నా, రెండు తెలుగు రాష్ట్రాలకు ఆ జల్లుల్లో తడిసి చల్లబడే అదృష్టం ఇప్పట్లో ఎలాగూ లేదు. దానికితోడు, అవి కేరళలో సకాలంలో కాలుమోపినా, అనంతరం నత్తనడకన పయనిస్తాయన్న ప్రమాద హెచ్చరిక మరొకటి.

వడదెబ్బ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య


ఇంతలోగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతలనూ, జవజీవాల్ని పిండేస్తున్న వడగాడ్పులనూ తట్టుకుని నిలబడటం ఎలాగో తలుచుకుంటేనే భయం క‌లుగుతున్నది. మొత్తంగా రెండు రాష్ర్టాల్లో ఇప్పటి వరకూ వడదెబ్బ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 172కు చేరింది. వడదెబ్బకు ప్రభుత్వాసుపత్రుల్లో చేరుతున్న సామాన్యుల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నది. కొత్తగూడెం, రామగుండం, పాల్వంచ, విజయవాడ ఇత్యాది ప్రాంతాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఇప్పటికే అసాధారణంగా ఉన్నాయి. మండువేసవికి వృద్ధులూ, అనారోగ్యవంతులు మాత్రమే దెబ్బతింటారన్న ధైర్యం కూడా ఈ ఏడాది వేసవితో సన్నగిల్లిపోయింది. మరణిస్తున్నవారిలో నడివయసువారు, యువకులు, విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా, చిరువ్యాపారులకు, తోపుడుబళ్లవారికీ రోజులు నరకప్రాయమైపోయాయి.
 

అకాల వర్షాలు రైతును మరింత దెబ్బతీశాయి


నెలాఖరుదాకా నిప్పుల కొలిమిలో బతకక తప్పదన్న వాస్తవంతోపాటు, రెండో ఏడాది కూడా వరుసగా వర్షాభావ పరిస్థితులు తప్పవన్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. గత ఏడాది వర్షపాతంలో పదిశాతం లోటు కారణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పెద్ద ఎత్తున పడిపోయింది. దానికితోడు, అకాల వర్షాలు రైతును మరింత దెబ్బతీశాయి. దేశవ్యాప్తంగా అనేకమంది రైతుల అకాలమరణానికి కారణమైనాయి. అనావృష్టి, అతివృష్టి, కుంభవృష్టి మధ్య రైతు జీవితం తెల్లారిపోతున్నది. ఒక మోస్తరు వర్షాలు కురిసే రోజులు పోయి, ఒక్కరోజులోనే కుంభవృష్టి కాలం దాపురించింది. 


రుతుపవనాల రాకడనూ, వర్షాల పరిమాణాన్నీ, వాటి ప్రభావాన్ని అంచనావేసుకుని, ఆహారధాన్యాల ఉత్పత్తిని సరిగా లెక్కలు కట్టుకోగల అవకాశాలు క్రమంగా సన్నగిల్లిపోతున్నాయి. రుతుపవనాలకు ఎక్కడో ఏర్పడే ఎల్‌నినో తోడై ఈ ఏడాది వానలు తగ్గిపోతాయన్న హెచ్చరిక మరింత భయపెడుతున్నది. భారత వాతావరణం విభాగం ఇటీవల విడుదల చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం, పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది దేశంలో వర్షాభావ పరిస్థితులు తప్పవు. అంతర్జాతీయ సంస్థలతో పాటు ఐఎండీ కూడా ఇదే అంచనాకు వచ్చినా, ఎల్‌నినో ఉన్నా రుతుపవనాలపై దాని ప్రభావం ఉండదనీ, సాధారణ వర్షపాతం తథ్యమని ‘స్కైమెట్‌’ ఇస్తున్న హామీ నిజం కావాలని కోరుకుందాం.
 


సగటు ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతున్నది


పారిశ్రామిక విప్లవ కాలంనుంచీ ప్రకృతి విషయంలో కనబరుస్తున్న నిర్లక్ష్యం పెరిగిపోతూ, పేరుకుపోతూ వస్తున్నది. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, శిలాజ ఇంథనాల విచ్చలవిడి వాడకం, వాతావరణంలోకి విషవాయువుల చేరిక విపరీతమైన మార్పులకు కారణమైంది. ధ్రువప్రాంతాల్లో మంచు కరిగిపోవడమూ, తీరప్రాంతాలు మునిగిపోవడం కళ్లముందు కనిపిస్తున్నదే. భూమి సగటు ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతున్నది. ఉత్తరాఖండ్‌ కుంభవృష్టి, శివాలెత్తిన గంగానది, కశ్మీర్‌ కడగండ్లు వంటివి వాతావరణ మార్పుకు సాక్ష్యాలుగా కళ్ళముందు ఉన్నాయి. ప్రకృతి సమతుల్యాన్ని ఖాతరు చేయకుండా వనరులను విచక్షణారహితంగా సంహ‌రించే విధానాలు కొనసాగుతున్నంత కాలం సామాన్యులు ఇలా నిప్పుల కొలిమిలో మాడిపోక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: