జూన్ 2 వచ్చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైన రోజది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని తెలంగాణ సంబరాలు చేసుకుంటుంటే.. అడ్డగోలు విభజనతో తమ గొంతుకోశారని ఆంధ్రాజనం తల్లడిల్లిన రోజు. రాష్ట్రం విడిపోయి ఏడాది అయిన సందర్భంగా వస్తున్న ఆరోజును ఎలా జరుపుకోవాలనేది ఇప్పుడు ఏపీజనం ముందున్న ప్రశ్న. 

జూన్ 2 - నవ నిర్మాణ దీక్ష.. 


ఏపీ సర్కారు మాత్రం ఆరోజును నవనిర్మాణ దీక్షగా నిర్వహించాలని డిసైడ్ చేసింది. గతంలో తమకు నచ్చని రోజులను బ్లాక్ డేలుగా ప్రదర్శించుకునేవారు. ఐతే.. ఓ రాష్ట్రం తమకు స్వయంపాలన అవకాశం కలిగిందని సంబరాలు జరుపుకుంటున్న వేళ.. బ్లాక్ డేలు జరుపుకుంటే ఇరు రాష్ట్రాల మధ్య విబేధాలు పెచ్చుమీరే ప్రభావం ఉన్నందువల్ల నవనిర్మాణ దీక్ష ఆలోచన బావుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. 

విభజించినవారు అసూయ పడేలా.. 


చరిత్రను వెనక్కు మరల్చలేం కాబట్టి.. చరిత్ర ఫలితాలను నెగిటివ్ అప్రోచ్ తో కాకుండా పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలన్న చంద్రబాబు ఆలోచన బావుంది. జూన్‌ 2న నవ నిర్మాణ దీక్ష చేపట్టాలి.. ఇందులో పాఠశాల విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించాలి.. ఈ దీక్షల్లో పాల్గొంటేనే వారికి చరిత్ర తెలుస్తుంది.. ఏపీకి జరిగిన అన్యాయం ఏమిటో వారికి అర్థమవుతుందని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు అన్నారు.  

నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రజలు పునరంకితం అయ్యేందుకు, మరింతగా స్ఫూర్తినిచ్చేందుకు ఇది చైతన్య దీక్షగా ఉపయోగపడాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. విభజించిన వారే అసూయపడేలా దీక్షను చేపట్టాలని ముఖ్యమంత్రి అంటున్నారు. కేవలం మాటల ద్వారా దీక్షల ద్వారా కాకుండా.. చేతల్లో ఆ స్ఫూర్తి కలిగించగలిగితే.. ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చడం అసాధ్యమేమీ కాదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: