తెలంగాణ వచ్చేవరకే మా కొట్లాట.. ఆ తర్వాత పాలనలో వివక్ష ఉండదు.. తెలంగాణలోని ఆంధ్రావారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటం.. ఇలాంటి ఎన్నో మాటలు.. కేసీఆర్ ఎన్నికలకు ముందు.. ఎన్నికల తర్వాత చెప్పారు. కానీ ఆచరణ విషయంలోకి వచ్చేసరికి.. తెలంగాణ ప్రభుత్వం కావాలనే వివక్ష చూపుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

ఆంధ్రా కులాలకు రిజర్వేషన్ వర్తించదా.. 


బీసీ జాబితాలోని దాదాపు 26 ఉపకులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీల జాబితా నుంచి  తొలగించడం ఇప్పుడు కొత్త వివాదానికి కారణమవుతోంది. ఈ కులాల మూలాలు కేవలం ఆంధ్రప్రాంతంలోనే ఉన్నాయి.. ఈ కులాల వారు తెలంగాణలో లేరు అన్న కారణంతో వీటిని బీసీ జాబితా నుంచి తొలగించారు. మార్చి ఒకటిన ఈ మేరకు జీవో 16 జారీ చేసింది.  

కేసీఆర్ సారూ.. ఇదేం వివక్ష..

 
బీసీ ఏ జాబితాలోని బందర, కొర్చ, కళింగ, కరుకల, పొంద వంటి కులాలు.. బీ జాబితాలోని ఆచుకట్ల, నగవద్దిలు, కుంచిటి వంటి కులాలు.. సీ జాబితాలోని అగరు, ఆటగరు, గవర తదితర 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారు. ఈ కులాల వారు ఆంధ్రా ప్రాంతం నుంచి ఎన్నో ఏళ్ల కిందట వలస వచ్చి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఇక్కడే స్థిరపడిపోయారు. 

ఇప్పుడు వీరికి తెలంగాణ రిజర్వేషన్ కల్పించదు. అటు ఆంధ్రాకెళ్తే.. స్థానికులు కారు.. మరి మా సంగతేంటని ఆయా కులాల వారు ఆందోళన చెందుతున్నారు.  ఇలాంటి వివక్ష తగదని.. తమకు కూడా బీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ వారు తెలంగాణ సీఎం ను కలిసే ఆలోచనలో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: