ఏపీ పాలిటిక్స్ లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉత్తరాంధ్రలో ప్రభావంతమైన నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షడు బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరిపోతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని బొత్స ఇంట్లో చర్చలు జరిగాయి. చర్చలు ఫలవంతంగా సానుకూలంగా జరిగినట్టు తెలుస్తోంది. 

వైకాపాలోకి బొత్స.. 


విభజనతో ఇప్పటికే చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ కు ఇది మరో గట్టిషాక్ గానే చెప్పుకోవచ్చు. ఐతే.. ఇది అనూహ్యమైన మార్పేమీ కాదు.. బొత్స వైసీపీకి వెళ్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కాకపోతే దాన్ని బొత్స ఖండిస్తూ వచ్చారు. ఏకంగా ఒక పత్రికపై పరువు నష్టం దావా కూడా వేస్తానన్నారు. 

సమరదీక్ష ద్వారా ప్రవేశం.. 


బొత్స ఇంటికి వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, జ్యోతుల నెహ్రూ... వైఎస్‌ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చి.. ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డికి దూరంగా ఉండటం భావ్యం కాదంటూ బొత్సను ఒప్పించారు. ప్రస్తుతం బొత్సకు కూడా అంతకుమించి దారులు లేవు. కాంగ్రెస్ కు ఎలాగూ భవిష్యత్తు లేదు.. బీజేపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ మధ్య టీడీపీకి కూడా ట్రై చేశాడని టాక్ వచ్చినా.. అది కూడా వర్కవుట్ కాలేదు. అందుకే బొత్స జగన్ బాట పట్టినట్టు తెలుస్తోంది. 

జూన్‌ 3, 4 తేదీల్లో జగన్‌ గుంటూరులో చేపట్టనున్న రెండు రోజుల సమర దీక్ష సందర్భంగా బొత్స వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది. అటు వైసీపీ నేతలకు కూడా... బొత్స రాకను వ్యతిరేకించవద్దని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఆమేరకు వారు స్వాగతిస్తూ ప్రకటనలు కూడా చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: