ఆధునిక ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అంతా ఇంతా కాదు.. మీడియా ఓ ఇష్యూను పట్టుకుని పదే పదే హైలెట్ చేస్తే.. దాని గురించి జనం ఆలోచిస్తారు. జనం ఆలోచించకపోయినా.. అధికారులు, పాలకులు ఆలోచిస్తారు. దానిపై స్పందిస్తారు. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మీడియాకు ఉన్న క్రేజ్ దేశంలో మరెక్కడా లేదనే చెప్పాలి. 

అందుకే దేశంలో ఏ ప్రాంతీయ భాషలోనూ లేనన్ని న్యూస్ ఛానళ్లు మన తెలుగు భాషలో ఉన్నాయి. ఇక మీడియాలో సంచలనంగా ప్రారంభమై.. అదే జోరు కొనసాగిస్తున్న టీవీ9 సంగతి చెప్పనక్కర్లేదు. ఆ ఛానల్ ఎందుకనో ఇటీవల హీరో శివాజీపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తోంది. శివాజీ కార్యక్రమాలను హైలెట్ చేయడం, దీక్షలను నిరంతరం లైవ్ కవరేజ్ ఇవ్వడం చేస్తోంది.  

ప్రత్యేక హోదా.. ఆంధ్రులహక్కు అంటూ ఇటీవల హీరో శివాజీ హడావిడి చేస్తున్నారు. ఆ మధ్య కొన్ని రోజులు దీక్ష చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు. ఉద్యమాన్ని ఓ క్రమపద్దతిలో నిర్వహించే సామర్థ్యం కానీ.. వ్యూహం కానీ శివాజీకి ఉన్నట్టు కనిపించదు. ఆవేశం తప్ప ఆలోచన పెద్దగా లేదు. మరి అలాంటి శివాజీకి టీవీ9 బాగా ప్రచారం కల్పిస్తోంది. 

లేటెస్టుగా శనివారం శివాజీ మీడియా సమావేశం నిర్వహించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటు కు నోటు, ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాలతో ప్రత్యేక హోదా అంశం పక్కదోవ పట్టిందని.. కానీ ప్రత్యేకహోదాపై తాను ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూనే ఉంటాననీ ఆవేశంగా చెప్పారు. ఆ క్రమంగా నాయకులను బ్రహ్మాండంగా తిట్టిపోశారు. శివాజీ మీడియా లైవ్ ను కేవలం టీవీ9 మాత్రమే ఆసాంతం ఇచ్చింది. మరి టీవీ9కు శివాజీపై అంత ప్రేమ ఏంటో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: