పాపం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. ఓవైపు ఆర్థిక వనరులు లేని అస్తవ్యస్థ ఆర్థిక పరిస్థితి. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన లక్షల కొద్దీ హామీలు.. ఏదోలా బండి లాక్కువద్దామంటే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కవ్వింపు చర్యలు.. ఇప్పుడు వీటికి తోడు ఓటుకు కోటు కేసు.. 

ఓటుకు కోటు కేసులో చంద్రబాబు డైరెక్టుగా ఇరుక్కుపోయారు. ఐనా.. ఏదోలా ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8, హైదరాబాద్, ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ.. ఏదో ఒక ఇష్యూ లేవదీసి..మొత్తానికి కిందా మీదా పడుతున్నారు. కేంద్రం పెద్దల అండదండలతో ఏదోలా మేనేజ్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ కేసు నుంచి బయటపడ్డట్టేనా..ఇంకా ముప్పు పొంచి ఉందా అన్నది అర్థం కావడం లేదు. 

భూసేకరణ.. అంత వీజీ కాదు.. 


ఇంతలో ఇప్పుడు మరో తలనొప్పి బాబుకు పొంచి ఉంది. అదే రాజధాని భూముల సేకరణ అంశం. రాజధాని ప్రాంత రైతులకు అరచేతిలో వైకుంఠం చూపి.. భవిష్యత్ బంగారుమయమవుతుందని వివరించి మొత్తానికి 33 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా పోగేశారు. కానీ ఇంకా మంకుపట్టువీడని రైతుల భూములను ఇప్పుడు భూసేకరణ చేయకతప్పని పరిస్థితి.  

భూ సమీకరణకు సంబందించి రైతులకు , భూయజమానులకు తగు సమయం ఇచ్చామని.. ఇక సేకరణ తప్పదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెబుతున్నారు. భూములు సేకరించడానికి గాను భూ సేకరణ చట్టం అమలుకు జూలై మొదటివారంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెబుతున్నారు. సర్కారు ఇంత సమయం ఇచ్చినా భూములివ్వని రైతులు.. ఇప్పుడు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. వారికి మద్దతిచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇక బాబుకు ఈ తలనెప్పి తప్పదేమో. 


మరింత సమాచారం తెలుసుకోండి: