రాజకీయ ఎత్తుగడలకు, వ్యూహాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టింది పేరు.. నోటికొచ్చింది వాగుతాడు.. అడ్డంగా తిడతాడు.. అని గిట్టనివాళ్లు తిట్టుకున్నా.. ఆయన ప్రతిమాటను ముందుగా అంచనా వేసే మాట్లాడతారని.. కావాలని ఎదుటి పక్షాలను ముగ్గులోకి దించేందుకే అలా మాట్లాడతారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. అలాంటి కేసీఆర్ కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. 

కేవలం సచివాలయం లేకపోతే.. ఫామ్ హౌజ్.. దాదాపు వారం రోజులుగా ఇదే పరిస్థితి. ఓవైపు ఓటుకు నోటు కేసు దర్యాప్తు సాగుతోంది. మరోవైపు ఏపీ సర్కారు ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు నడిపిస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ మౌనం పొలిటికల్ వర్గాలకో పజిల్ గా మారింది. ఈ రెండు కీలక వ్యవహారాల్లో రెండు వర్గాలకూ రాజీ కుదిరిందని వస్తున్న వార్తలను కేసీఆర్ పరోక్షంగా అంగీకరిస్తున్నారా.. అనేది అర్థంకాని విషయం. 

కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు.. పొలిటికల్ గేమ్.. 


ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబును కేసీఆర్ అంత తేలిగ్గా వదలబోడని ఆయన గురించి బాగా తెలిసిన విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర మంత్రులు చంద్రబాబుతో రాజీకి ప్రయత్నాలు జరిపినా కేసీఆర్ మెట్టుదిగలేదని సమాచారం వస్తోంది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కలుస్తానని అన్నా కేసీఆర్ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని కూడా చెబుతున్నారు.

ఇదే సమయంలో.. కాంప్రమైజ్ వర్కవుట్ అవుతోందన్న ప్రచారం అవాస్తవమని, అలాంటిది ఏమీ లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తేల్చి చెప్పారు. ఇందులో రాజీ పడవలసింది ఏముందని... చట్టం ప్రకారం కేసు నమోదైందని, ఒకసారి కేసు రిజిస్టర్ అయ్యాక, అందులో ఎలాంటి రాజీ జరగదని కడియం కుండబద్దలు కొడుతున్నారు. ఏసీబీ అధికారులు పకడ్బందీ చర్యల కోసం కొంత సమయం తీసుకుంటున్నారని.. దాన్ని వేరేలా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని కడియం అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: