తెలుగు రాజకీయాల్లో ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 హవా నడుస్తోంది. కొన్నిరోజులుగా ఏ రాజకీయనాయకుడి నోట విన్నా.. వీటికి సంబంధించిన సంభాషణలే.. కానీ ఇప్పుడు సీన్ మారే అవకాశం వచ్చిందా.. ఈ అంశాలను తలదన్నేలా మరో కొత్త ఇష్యూ తెరపైకి రాబోతుందా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

లేటెస్టుగా హైకోర్టు చేసిన ఓ వ్యాఖ్య ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రతిపక్షనేత జగన్ ఆస్తుల కేసులో పురోగతి ఏంటో చెప్పాలని సీబీఐని హైకోర్టు కోరింది. విజయవాడకు చెందిన వేదవ్యాస్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఈ కేసు విచారణ వేగంగా జరిగేలా చూడాలని ఆయన తన పిటిషన్లో కోరారు. 

జగన్ కేసు మలుపు తిరుగుతుందా..?


జగన్ అక్రమాస్తుల కేసు ఒకప్పుడు  ఉమ్మడి ఏపీని ఊపేసింది. మీడియాలో ఎక్కడ చూసినా ఆ కేసు వార్తలే కనిపించేవి.. అప్పట్లో ఈ కేసు చూసిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు హీరో వర్షిప్ లభించింది. అలాంటిది.. జగన్ కు  బెయిల్ రావడంతో ఒక్కసారిగా నీరసపడిపోయింది. ఈ కేసు తేలటానికి ఇంకెన్నాళ్లు పడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

పిటిషనర్ కోరుకున్నట్టు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగంగా జరిగి ఓ కొలిక్కి వస్తుందా.. వస్తే దాని పరిణామాలేంటి.. ఈ ఇష్యూ జగన్ కు లాభిస్తుందా.. నష్టం చేస్తుందా.. ఈ అంశాలు ఇప్పుడు వైసీపీ నేతల్లో గుబులుపుట్టిస్తున్నాయి. ఐతే మన కోర్టుల్లో కేసులు అంత సులభంగా తెమలవన్న సంగతి తెలిసిందే. జయలలిత అక్రమాస్తుల కేసులో విచారణ దాదాపు పదేళ్ల తర్వాత మొన్నటికి మొన్న ఓ కొలిక్కి వచ్చింది. మరి జగన్ అక్రమాస్తుల కేసు ఎప్పుడు తేలుతుందో.. ?


మరింత సమాచారం తెలుసుకోండి: