ఆయనేమో ఎంచక్కా.. ‘రెండు రోజుల్లో స్పందిస్తా’ అంటూ ట్వీటర్‌ ద్వారా ఒక ప్రకటన పారేసి ఊరుకున్నారు. ఏం స్పందిస్తారు... ఎవరికి అనుకూలంగా స్పందింస్తారు? ఏ కోణంలో స్పందిస్తారు? అంటూ రకరకాల ఊహాగానాలతో మీడియాలో బులెటిన్లు హోరెత్తిపోతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ కోటరీలో.. ఆయనకు రాజకీయ సలహాదారులుగా కాలగిగిన వాళ్లు.. ఆయనకు విశ్వసనీయులైన వాళ్లు.. సమాచారాన్ని పోగేయడంలో బిజీగా ఉన్నారుట. ఓటుకు నోటు , సెక్షన్‌ 8, ఫోను ట్యాపింగ్‌  వ్యవహారాల గురించి.. సమగ్రంగా సమాచారాన్ని సేకరించి, పవన్‌ కల్యాణ్‌కు ప్రసంగ పాయింట్లను తయారుచేయడంలో ఆయన రాజకీయ సలహా కోటరీ ప్రస్తుతం ముమ్మరంగా పనిచేస్తున్నదట. 
రెండు రోజుల్లో స్పందిస్తా అంటూ పవన్‌ కల్యాణ్‌ చిన్న ట్రైలర్‌ వదిలారు. పవన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ దృష్ట్యా.. ఆ ట్రైలర్‌ పార్ట్‌ వరకే ఇప్పుడు మీడియాలో బీభత్సంగా హల్‌ చల్‌ చేస్తోంది. అయితే ఆయన స్పందించి ఏం చేస్తారు? ఇదేదో యథాలాపంగా.. జనానికి సందేశాలు, ఉపదేశాలు ఇచ్చేసే రాజకీయ సభ కానే కాదు. పైగా ఓటుకునోటు, సెక్షన్‌8, ఫోను ట్యాపింగ్‌ అంశాలమీద మాట్లాడతానని ఆయన చెప్పనే చెప్పారు. 
ఈ అంశాల్లో ఓటుకు నోటు వ్యవహారం మీద మాట్లాడడం ఈజీ. అక్కడ తప్పేమిటో ఒప్పేమిటో... చిన్న పిల్లలు కూడా చెప్పగలిగిన సంగతి. పైగా జరిగిన వ్యవహారం ఏమిటో.. కళ్లకు కట్టినట్లు టీవీల్లో కనిపిస్తూనే ఉన్నది. పవన్‌ కల్యాణ్‌ తేల్చుకోవలసినదెల్లా.. తాను ఎవరివైపు మద్దతు ఉండేలా మాట్లాడాలన్న విషయం మాత్రమే. కొత్తగా ‘తెలుసుకుని’ మాట్లాడడానికి అందులో ఏం ఉండదు. అదే సెక్షన్‌8, ఫోను ట్యాపింగ్‌ వ్యవహారాల సంగతి అలా కాదు. 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం ఏం చెబుతున్నదో.. సెక్షన్‌ 8 అనే చట్టపరమైన నిబంధన హైదరాబాదులోని ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి వెసులుబాటు కలిగిస్తున్నదో.. గవర్నరు శాంతి భద్రతలను పర్యవేక్షించినంత మాత్రాన అది తెలంగాణ ప్రభుత్వానికి అవమానం ఎందుకు అవుతుందో.. ఎందుకు కాదో.. ఏ చట్టం ద్వారా రాష్ట్రం ఏర్పడిరదో, అదే చట్టంలోని ఒక భాగాన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నదో.. ఇలాంటి అనేక కీలకాంశాలమీద పవన్‌ ముందుగా అవగాహన పెంచుకోవాలి. ఆ అవగాహన పెంచుకోకుండా మాట్లాడ్డానికి పూనుకుంటే.. ఆయన అభిమానుల ముందు పేలవంగా తేలిపోయే ప్రమాదం ఉంటుంది.
ఫోను ట్యాపింగ్‌ వ్యవహారం కూడా అంతే. కేవలం ఫోను ట్యాపింగ్‌ చేయించినంత మాత్రాన ప్రభుత్వమే కూలిపోయేంత నేరం ఏమున్నదో.. అందుకు చట్టపరమైన నిబంధనలు ఏమిటో, వాటి అతిక్రమణ ఎలా జరిగిందో.. లాంటి వివరాలన్నీ ప్రాథమికంగా పవన్‌ కల్యాణ్‌ తెలుసుకోవాల్సి ఉంది. అందుకే ఇప్పుడు ఆయన తన కోటరీలోని సలహాదారులందరినీ ఈ పనిమీదే పురమాయించారుట. 
ఈ అంశాలకు సంబంధించి... ఆయన మనుషులు సమగ్ర సమాచారం సేకరిస్తున్నారట. జర్నలిస్టులు, న్యాయనిపుణులు, అధికార్లలో సీనియర్లనుంచి సమాచారాన్ని సమగ్రంగా సేకరించి.. పూర్తిగా ఆకళింపు చేసుకున్న తర్వాతే తన అభిప్రాయాన్ని ప్రెస్‌మీట్‌ ద్వారా వెల్లడిరచాలని పవన్‌ కల్యాణ్‌ అనుకుంటున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అంత కన్‌స్ట్రక్టివ్‌గా పవన్‌ మాట్లాడితే మంచిదే.. ఏదో సినిమా వేడుకల్లో ప్రసంగంలాగా జనంతో తప్పట్లు కొట్టించుకోవడమే లక్ష్యంగా మాట్లాడితే.. ప్రస్తుతం ఉన్న రాజకీయ వేడికి ప్రజలు నవ్వుకుంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: