ప‌రిపాలనాప‌రంగా త‌న దైన శైలీ లో ముందుకు పోతున్న ప్ర‌దానీ న‌రేంద్ర‌మోడీ రాజకీయ ప‌రంగా ఓడి పోయాడ‌నే చెప్ప‌వ‌చ్చు! అంతే కాదు అయ‌న‌కు చాలా చికాకులే తెచ్చిపెడుతున్నాయి. ఈ చికాకులు విప‌క్షాల‌నుంచే కాకుండా స్వ‌ప‌క్షాల నుంచి కూడా వ‌స్తున్నాయి. పార్టీ లో కూడా త‌న స‌హ‌చ‌రుల‌తో కాకా త‌న క‌న్నా సీనియ‌ర్ల నుంచి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. 75 ఏళ్లు  దాటిన మమ్ములంద‌రిని మోడీ బ్రెయిన్ డెడ్ ప్ర‌క‌టించారని బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మేధావి అయిన య‌శ్వంత్ సిన్హా ఇటీవ‌ల ప‌రోక్షంగా వ్యాఖ్యానించి బీజేపీ లో సీనియ‌ర్ల‌కు జ‌రుగుతున్న అన్యాయం గురించి ప‌రోక్షంగా చెప్పారు. మ‌రో సీనియ‌ర్ నేత ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి గంగాన‌రి ప్ర‌క్షాళ‌న పై మాట్లాడుతూ ప్ర‌స్తుతం మోడీ ప్ర‌భుత్వం చేస్తున్న విధంగా చేస్తూ పోతే ఇంకో వందేళ్ల‌యిన గంగాన‌ది ప్ర‌క్షాళ‌న పూర్తి కాద‌ని విమ‌ర్శించారు. వీరంద‌రిది ఒక ఎతైతే భార‌తీయ జ‌న‌తా పార్టీ కురువృద్దుడు లాల్ కృష్ణ అద్వానీ చేస్తున్న విమ‌ర్శ‌లు మ‌రో ఎత్తు.

అద్వానీ విమ‌ర్శ‌లు ధాటికి త‌ట్టుకోవ‌డం ప్ర‌ధానీ మోడీ త‌లకు మించిన భారం


 
సీనియ‌ర్ నాయకులు అద్వానీ విమ‌ర్శ‌లు ధాటికి త‌ట్టుకోవ‌డం ప్ర‌ధానీ మోడీ త‌లకు మించిన భారం అవుతోంది.ప్ర‌జా జీవ‌నం అలో నేతలు నీతి నిజాయితీ కి పెద్ద పీట వేయాలంటూ అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌ర రాజే ల‌పై ఆయ‌న ప‌రోక్ష విమ‌ర్శ‌లు గుప్పించారు. అద్వాఈన బెంగాలీ ప‌త్రిక‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూ లో ప్ర‌ధాని మోడీ పై ప‌రోక్ష దాడికి దిగారు. ఆయ‌న ఈ విధంగా మోడీ ని ఇర‌కాటంలో పెట్ట‌డం ఇటీవ‌లి కాలంలో ఇది రెండో సారి.  దేశంలో మళ్లీ అత్యాయక పరిస్థితి (ఎమర్జెన్సీ) రాదని చెప్పలేమని ప్రధాని మోడీ నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నారనే అర్ధం వచ్చే విధంగా అద్వానీ మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ ఇలా చేస్తున్నారని అద్వానీ చెప్పలేదు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు సరిగ్గా ప్రధానికే గుచ్చుకున్నాయి. 


ఇప్పుడు రాజధర్మాన్ని పాటించాలంటూ హితవు చెబుతూ అద్వానీ అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు. హవాలా ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో లోక్‌సభ సభ్యత్వానికి తాను ఎలా రాజీనామా చేసిందీ అద్వానీ గుర్తు చేశారు. ఆరోపణల్లో నిజం లేదన్న విషయం రుజువైన తరువాతే తాను లోక్‌సభకు పోటీ చేసి గెలిచానన్నారు. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవటం రాజకీయ నాయకుడి అతిపెద్ద బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. నీతి నిజాయితీకి కట్టుబడి ఉండటం రాజధర్మం అంటూ అద్వానీ మోడీ ప్రభుత్వానికి చురకలు వేశారు. లండన్‌లో దాక్కున్న ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోడీకి పోర్చుగల్‌ ప్రయాణ పత్రాలు ఇప్పించిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియాలు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు పెద్దఎత్తున డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో అద్వానీ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

అద్వానీ ఇటీవలి కాలంలో మోడీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు 


కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తనకు సముచిత ప్రాధాన్యత ఇవ్వనందుకు ఆగ్రహంతో ఉన్నారా అనే విధంగా అద్వానీ ఇటీవలి కాలంలో మోడీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించటం పార్టీ నాయకులకే విస్మయం కలిగిస్తున్నది. అద్వానీ విమర్శలు చేసిన ప్రతి సారీ అవి విపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అద్వానీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ మోడీ ప్రభుత్వంపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దేశంలో మరోసారి ఎమర్జెన్సీని విధించే అవకాశాలు లేకపోలేదంటూ అద్వానీ ఇటీవల చేసిన వ్యాఖ్య మోడీని ఎంతగా ఇబ్బంది పెట్టిందంటే 40 ఏళ్ల కిందట దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలో పెడదామనుకున్న ప్రధాని ఆయన వ్యాఖ్యలతో మాట్లాడటమే కష్టమైపోయింది.

గుజరాత్‌లో గోధ్రా సంఘటన తర్వాత మతకలహాలు


గుజరాత్‌లో గోధ్రా సంఘటన తర్వాత మతకలహాలు తలెత్తిన సమయంలో రాజధర్మం పాటించాలంటూ అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి అప్పటి గుజరాత్‌ సిఎం నరేంద్ర మోడీకి హితవు చెప్పారు. అయితే రాజధర్మం పాటించే సానుకూలతను అప్పటి పరిస్థితులు నరేంద్ర మోడీకి ఇవ్వలేదు. అల్లర్లను అదుపుచేయడంలో నరేంద్ర మోడీ తీవ్ర పక్షపాతం వహించారని దేశవ్యాప్తంగా గగ్గోలు చెలరేగిన విషయం కూడా మన స్మృతిపథం నుంచి తొలగిపోదు. తర్వాత జరిగిన పరిణామ క్రమంలో మళ్లీ మళ్లీ గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీని గట్టెక్కిండంలో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ కృతకృత్యుడయ్యారు. ముఖ్యమంత్రి పీఠం పై నుంచి ఆయనను కదిలించడం అసాధ్యమే అయింది. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అనేక తర్జన భర్జనల తర్వాత ఆయనను ప్రధాని అభ్యర్ధిగా ఎంపిక చేసుకున్నది. దీనికి అద్వానీ తీవ్రంగా అడ్డుపడ్డారు. మోడీపై ఉన్న మతతత్వ ముద్ర కారణంగా పార్టీ అధికారంలోకి రావడం కష్టమని చెప్పారు. మోడీ ప్రధాని అభ్యర్ధి అంటే మిత్రపక్షాలు కూడా ముందుకు రావని అద్వానీ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో సుష్మా స్వరాజ్‌ను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని పార్టీకి సూచించారు. అందుకు పార్టీ ఒప్పుకున్నదో లేదో బహిరంగంగా తెలియదు కానీ అద్వానీ అభ్యర్ధిగా సుష్మా స్వరాజ్‌ రంగంలోకి వచ్చారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపికి అంత అవసరం కలుగలేదు. బిజెపి సొంతంగా అధికారంలోకి వచ్చేసింది.


మ‌రోవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చే హామీలకు నేతలు కట్టుబడి ఉండాలని అద్వానీ ఇదే ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నది మోడీ ప్రభుత్వం కాబట్టి అద్వానీ ఏం మాట్లాడినా ఆయనకే అన్వయించుకుంటారు. ఇంత చిన్న లాజిక్కు తెలియనంతటి చిన్న వ్యక్తి కాదు అద్వానీ. ప్రధాని మోడీకి రోజు రోజుకు పెరుగుతున్న చీకాకులకు అద్వానీ వ్యాఖ్యలు అదనం. తాజాగా న‌రేంద్ర‌మోడీ అద్వానీ ని  విశ్మ‌రించార‌న్న వాద‌న‌లు బ‌లంగా వీస్తున్నాయి. ఒకానొక్క‌ప్పుడు ఒంటికాలు తో బీజేపీ ని న‌డిపించిన అధ్వానీ ని మోడీ విశ్మ‌రించ‌డం కూడా క‌రెక్ట్ కాద‌ని అంద‌రిలో ఉన్న భావ‌న‌. వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రధాని మోడీ ఏం చేస్తారో వేచి చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: