వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక రాయి వేసి చూద్దాం అనుకుంది. గెలుస్తాం అనే నమ్మకం తొలినుంచి లేదు. అందుకే ఎందరికి ఆఫర్లు ఇచ్చినా.. పార్టీలోని కీలక నాయకులంతా.. పోటీకి దిగడానికి విముఖత చూపించారు. తీరా ఓ నాయకుడిని పోటీకి దించారు.  మధ్యలో తమ పార్టీకి చెందిన వారిని తెదేపా కొనేస్తున్నదంటూ ఓ ప్రచారాన్ని కూడా ముమ్మరంగా సాగించారు. కానీ.. వారి ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. తీరా ఎన్నికల ముంగిట్లోకి వచ్చిన తర్వాత... ఓటమి గ్యారంటీ అని బోధపడి.. సమరాంగణం నుంచి తప్పుకుంటున్నట్లుగా ఓ ప్రకటనతో వైకాపా వెనక్కు తగ్గవలసి వచ్చింది. 
ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం పదమూడు స్థానాలకు గాను 11 ఆల్రెడీ ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతం రెండు జిల్లాల్లో మాత్రమే ఎలక్షన్‌ జరుగుతోంది. ఆ రెండు జిల్లాల్లో కూడా విచిత్ర పరిస్థితులే ఉన్నాయి. 
ఈ ఎన్నికల్లో బేరసారాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు తమకు బలం లేని జిల్లాల్లో పోటీచేయకూడదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుగానే ప్రకటించింది. మెజారిటీ జిల్లాల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసిపోవడానికి కారణం అదే. ఒక్క గుంటూరు జిల్లాలో మాత్రమే అలాంటి ఒప్పందానికి కట్టుబడి నిలిచిన తెలుగుదేశం, వైకాపా కంటె తమకు సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ.. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పోటీకి దిగింది. అయితే తమ రెండు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం కంటె.. ఇండిపెండెంట్లు అధికంగా ఉన్నందున వారు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారనే ఉద్దేశంతో పోటీకి దిగినట్లు వారు చెప్పుకున్నారు. ప్రకాశం జిల్లాల్లో పార్టీల మధ్య సంఖ్యాబలం తేడా కంటె.. ఇండిపెండెంట్లు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. పైగా తెదేపా అభ్యర్థిగా మోహరించిన మాగుంట శ్రీనివాసులరెడ్డి మాజీ ఎంపీ. జిల్లా అంతా ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. వైకాపాలోనూ.. ఆయనకు నాయకుల బలం పుష్కలంగా ఉంది. పార్టీకి సంబంధంలేకుండా వైకాపా వారు ఆయనకు ఓటు వేసే అవకాశాలు చాలా ఉన్నాయనేది వారే చెబుతున్న లెక్క. ఇలాంటి నేపథ్యంలో వైకాపా గెలుపు అనుమానం అని తొలినుంచి అనుకున్నారు. 
దానికి తగ్గట్లుగానే.. ఎన్నికల్లో ఓడిపోయిన మామ బాలినేని శ్రీనివాసులు రెడ్డిని ఎమ్మెల్సీ అయినా చేద్దాం అని జగన్‌ ఆయనకు ఈ టికెట్‌ ఆఫర్‌ చేస్తే.. ఇదే అనుమానంతో తిరస్కరించారు. ఎమ్మెల్యేగా ఓడిన మరో నేత బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కూడా ఆఫర్‌ను తిరస్కరించారు. చివరికి ఎవరో ఒక అభ్యర్థిని బరిలోకి దింపారు. అయినా వారిలో ఆదినుంచి అనుమానాలు ఉండనే ఉన్నాయి. 
ఈలోగా నెల్లూరు జిల్లాలో వైకాపా ప్రతినిధులకు తాయిలాల ఆశచూపి తెలుగుదేశం క్యాంపు నిర్వహిస్తున్నదనే పుకార్లు వచ్చాయి. దానిపై ఈసీకి కూడా ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. గవర్నరుకు  కూడా చెప్పుకున్నారు. కానీ వారి మొరాలకించిన వారు లేరు. తాము ఎవరికి ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, అధికార తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదని... అందుకే తాము ప్రకాశం జిల్లా ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నాం అని ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో పోలింగ్‌కు ముందే... రెండిరట్లో ఒక జిల్లా తెలుగుదేశం ఖాతాలో పడిపోయినట్లు అయింది. 
గెలుపు అంత ఈజీ కాదని ముందునుంచి అనుకున్నప్పటికీ.. ఒక రాయి వేసి చూద్దాం అని వైకాపా సాగించిన  ప్రయత్నాలు ఫలించలేదని ప్రజలు అనుకుంటున్నారు. అయినా పోటీనుంచి తప్పుకుని తెదేపాను గెలిపించడం కంటె.. పోలింగ్‌ వరకు ఆగితే.. కనీసం తెదేపా వారు వైకాపా ప్రతినిధుల్ని కొనుగోలు చేసినట్లు ఓట్ల పరంగా రుజువు అవుతుంది కదా అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: