తెలుగు రాష్ట్రాల్లో మీడియా పార్టీలవారీగా విడిపోందన్న సంగతి తెలిసిందే. పత్రికలు, ఛానళ్లు పార్టీల అనుబంధ యంత్రాంగాల్లా మారిపోయాయి. గతంలో ఓ మాదిరిగా ఉండే ఈ వ్యవహారం ఇప్పుడు బహిరంగంగానే సాగిపోతోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కేసీఆర్ కు వ్యతిరేక గ్రూప్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబును వెనకేసుకురావడంలో.. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేక కథనాలు వండివార్చడంలో ఆ గ్రూపు ఆరితేరిపోయందని మీడియా సర్కిల్లో అభిప్రాయం ఉంది.

ఇక టీ న్యూస్ సంగతి చెప్పే పని లేదు.. ఆ ఛానల్ ఉండేదే ఏకంగా తెలంగాణ భవన్లో. ఇక ఛానల్ యాజమాన్యం కూడా కేసీఆర్ బంధువర్గమే. ఇక ఆ ఛానల్లో అధికార పార్టీ అనుకూల కథనాలు వస్తాయని వేరే చెప్పనక్కర్లేదు కూడా. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో రికార్డులు మొదట ప్రసారం చేయడం ద్వారా టీ న్యూస్ ఈ మధ్య బాగా వార్తల్లోకి వచ్చేసింది. 

మంగళవారం రేవంత్ బెయిల్ పిటీషన్ పై కోర్టు తీర్పు సందర్భంగా ఈ రెండు ఛానళ్ల ప్రత్యక్ష యుద్ధం మరోసారి బయటపడింది. అప్పటివరకూ కోర్టు వార్తలు బాగానే ఇచ్చిన టీ న్యూస్.. రేవంత్ కు బెయిల్ రావడంతో ఒక్కసారిగా మూగబోయింది. అన్ని ఛానళ్లూ రేవంత్ కు బెయిలొచ్చిందని బ్రహ్మాండం బద్దలయ్యేలా బ్రేకింగ్ న్యూసులు, లైవులు ఇచ్చేస్తుంటే.. టీ న్యూస్ మాత్రం చాలా సేపు మౌనం పాటించింది. వార్తను వార్తలా ఇవ్వాలన్న సంగతి కూడా మరచింది. 

ఏబీఎన్ వార్తలపై టీ న్యూస్ బ్రేకింగుల దాడి.. 


ఈలోపు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రెచ్చిపోయింది. రేవంత్ కు బెయిలొచ్చిందన్న వార్తలతో పాటు.. రేవంత్ తెలంగాణ పులిబిడ్డ అంటూ పోస్టర్ చేయించేసి.. టీడీపీ కార్యకర్తలు రూపొందించిన పాట ప్రసారం చేస్తూ తన సంతోషాన్ని చెప్పకనే చెప్పేసింది. అసలే రేవంత్ కు బెయిలొచ్చిందన్న బాధలో ఉండి.. ఏ వార్త ఇవ్వాలో అర్థంకాకుండా ఉన్న టీ న్యూస్ కు ఏబీఎన్ ప్రసారాలే వార్తాకథనమైంది. తెలంగాణకు చేటు తెస్తున్న రేవంత్ రెడ్డిని కీర్తిస్తూ ఏబీఎన్ కథనాలు ప్రసారం చేస్తోందంటూ బ్రేకింగు న్యూసుల్తో హడావిడి చేసింది.

ఏబీఎన్ ఛానల్ లైసెన్సునే రద్దు చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారంటూ.. వారితో ఫోన్లో మాట్లాడించి.. రేవంత్ బెయిల్ వార్తను సైడ్ ట్రాక్ లోకి నెట్టేసింది.  ఎవరికి అనుకూలంగా వారు కథనాలు ఇచ్చుకోవడం మామూలే కానీ.. ఇలా ఒకరి వార్తలపై మరొకరు దుమ్మెత్తిపోస్తూ బ్రేకింగు న్యూసులు ఇవ్వడం మాత్రం కొత్త కల్చరే. మొత్తానికి టీ న్యూస్-ఏబీఎన్ వార్ కొత్త పుంతలు తొక్కుతోందన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: