కాంగ్రెస్‌ పార్టీలో గౌరవప్రదమైన పదవులను అనుభవించడం అంటే.. అది కేవలం సోనియాకుటుంబానికి మితిమీరిన విధేయతతో ఉండడం, సోనియా కుటుంబసభ్యులను భజన చేయడంతో మాత్రమే సాధ్యమని అందరికీ తెలుసు. ఏదో యథాలాపంగా పదవుల్లోకి వచ్చేసిన వారెవరైనా ఉంటే.. ఆ వెంటనే.. ఈ సిద్ధాంతాన్ని తప్పక అలవరచుకుంటారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌ హోదాలో ఉన్న ఉత్తమకుమార్‌రెడ్డి కూడా అదే బాటలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆయన రాహుల్‌కు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోలిక తేవడానికి ప్రయత్నిస్తున్నారు. 
దిగ్విజయసింగ్‌ ఇటీవలి హైదరాబాదు పర్యటనలో తలంటి వెళ్లినప్పటినుంచి కాంగ్రెసు నేతల్లో కాస్త జోరు పెరిగింది. పదేపదే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి వారు సిద్ధమవుతున్నారు. ఏదో ఒక సందర్భాన్ని సృష్టించుకుంటున్నారు. అదే రీతిగా బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చిన పీసీసీ చీఫ్‌ కూడా తెలంగాణలో రైతుల ఆత్మహత్యల ప్రస్తావన తీసుకువచ్చారు. ఇక్కడ మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి ఎక్కడో ఢల్లీిలో ఉన్న రాహుల్‌ గాంధీకి టైం దొరికింది గానీ.. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కు మాత్రం టైం దొరకడం లేదని ఆయన అంటున్నారు.
అయినా ఇదెక్కడి వింతైన పోలికా అని ఆ మాటలు విన్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రాహుల్‌ అంటే ఆల్రెడీ ఖాళీ అయిపోయిన నాయకుడు. ఆయన కేవలం ఎంపీ మాత్రమే. అదే కేసీఆర్‌.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎవరికి ఎక్కువ ఖాళీ ఉంటుందో ఆ మాత్రం పీసీసీ చీఫ్‌ కు తెలియదా అని నవ్వుకుంటున్నారు. 
రాహుల్‌ గాంధీ బాధ్యత గురించి, ఆయన పట్టింపు గురించి ఒకరు కితాబివ్వాల్సిన పని లేదని.. ఒకవైపు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మొదలైతే... ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేతగా ఉండి, తనకు సెలవు కావాలంటూ నెలల తరబడి అదృశ్యం అయిపోయిన రాహుల్‌ గాంధీకి టైం దొరకడం లో వింతేం ఉన్నదంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాహుల్‌ భజన చేయదలచుకుంటే.. అందుకు ఉత్తమకుమార్‌ రెడ్డి మరో రకమైన మార్గాలు వెతుక్కుంటూ బాగుంటుంది గానీ.. ఇలా కేసీఆర్‌ పోలిక తేవడం మాత్రం మరీ పేలవంగా ఉందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: