తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి విడుదల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిఫెన్సులో పడేసింది. కేవలం బెయిలే కదా వచ్చింది.. కేసు నుంచి విముక్తి రాలేదుగా అని సరిపెట్టుకుందామన్నా... ఈ కేసులో జరుగుతున్న వరుస పరిణామాలు కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయి. స్టీఫెన్ సన్ ను కోర్టు చీవాట్లు పెట్టడం.. ఏసీబీ తదుపరి చర్యలు తీసుకోలేకపోవడంతో ఈ కేసులో టీడీపీదే అప్పర్ హ్యాండ్ గా కనిపిస్తోంది. 

ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరుపై రెచ్చిపోయి విమర్శించారు. కేసీఆర్ తో పాటు ఆయన మంత్రివర్గాన్నీ బండబూతులు తిట్టేశారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను రప్పించుకుని మంత్రిపదవులు ఇచ్చారని.. మండిపడ్డారు. కేసీఆర్‌లో ప్రవహించేంది తెలంగాణ రక్తమే అయితే.. ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న సన్నాసుల చేత రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. 

వాళ్లు గెలిస్తే టీడీపీ జెండా ఎగరేయం.. రేవంత్ సవాల్.. 


ఒకవేళ ఇతర పార్టీల నుంచి వచ్చిన మంత్రులు రాజీనామా చేసి గెలిస్తే... నాలుగేళ్లు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయం.. అని ప్రతిజ్ఞ చేశారు. అదే టీఆర్‌ఎస్‌ ఓటమిపాలైతే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కేసీఆర్ నేలకు ముక్కురాస్తారా? అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. మంత్రులపైనా రేవంత్ నిప్పులు చెరిగారు. టీవీల్లో టీఆర్‌ఎస్‌ మంత్రులు చాలా మంది మాట్లాడుతున్నరు. వీళ్లంతా కేసీఆర్‌కు తందానా అంటున్నారు. వీరిలో ఒక్కరైనా పాత చెప్పుతో సమానంగా ఉన్నారా? అని విమర్శించారు.

రేవంత్ రెడ్డి సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయిన తలసాని శ్రీనివాస యాదవ్.. రాజీనామా చేసినా స్పీకర్ ఆమోదించలేదు. ఈ అంశాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఓటుకు నోటు వ్యవహారంలోనూ చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇప్పుడు రేవంత్ కూడా దానిపైనే సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు రాజీనామాలు చేసి పార్టీని గెలిపించుకున్న కేసీఆర్.. మరి రేవంత్ సవాల్ కు స్పందిస్తారా..?


మరింత సమాచారం తెలుసుకోండి: