తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా ఉన్న, ఇతర పార్టీల్లోకి ఫిరాయించే అవకాశం కూడా లేకుండా ఉన్న సీనియర్‌ నాయకులందరికీ బుధవారం ఉదయం నుంచి ఒకటే పని. తమ పార్టీలో కాస్త అనుమానాస్పదంగా వ్యవహరించే నాయకులందరికీ ఫోన్లు చేయడం.. మీరు తెరాసలోకి వెళ్లవద్దు, మన పార్టీకి చాలా మంచి భవిష్యత్తు ఉంది. వచ్చే ఎన్నికల తర్వాత మనమే అధికారంలోకి రాబోతున్నాం అంటూ... బతిమాలడమే. ప్లీజ్‌ మీకు మాత్రం తెరాసలోకి వెళ్లే ఆలోచన ఉంటే మానుకోండి, పరిస్థితిని అర్థం చేసుకోండి. మన పార్టీ చాలా బలపడబోతోంది.. అంటూ వారిని నమ్మించే ప్రయత్నం చేయడమే. మాజీ మంత్రి డీ శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ను వీడి, తెరాసలో చేరబోతున్న సమయంలో.. ఆయన వెంట మరింత మంది నాయకులు వెళ్లకుండా చూడడానికి టీపీసీసీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తర్వాత డీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ.. తన వెంట ఎవరెవరు తెరాసలో చేరబోతున్నది త్వరలో తెలుస్తుందని ఒక బాంబు పేల్చారు. దీంతో కాంగ్రెస్‌ వర్గాలో వణుకు మొదలైంది. రెండుసార్లు పీసీసీ చీఫ్‌గా పనిచేసిన సీనియర్‌గా డీఎస్‌కు అన్ని ప్రాంతాల కార్యకర్తలు, నాయకులతోను సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటిది ఆయన అధికార పార్టీలోకి వెళుతున్నప్పుడు.. ఆయన స్వయంగా తాయిలాల ఆశచూపితే.. కాంగ్రెస్‌ శ్రేణులు ఎగబడి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీని కట్టుబాటుతో కాపాడుకోవడం గురించి నాయకులు పాట్లు పడుతున్నారు. 
ప్రధానంగా డీఎస్‌ పోకతో పాటుగా నిజామాబాద్‌ జిల్లాలో చాలా మంది నాయకులు తెరాసలోకి వెళ్లిపోవచ్చుననేడి కాంగ్రెస్‌ వర్గాల అనుమానం. దానికి తగ్గట్లుగానే టీపీసీసీ నేతలు ఉత్తమకుమార్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క లు ఆ జిల్లాలోని చాలా మందికి ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీని వీడవద్దని, వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోతున్నామని.. పార్టీ కి ద్రోహం చేయవద్దని వారు బతిమాలుతున్నారు. అయినా సరే.. అధికార పార్టీ అండదండలు, తద్వారా అవకాశాలు లభిస్తున్నప్పుడు.. ఎంత మంది నాయకులు పార్టీకోసం కట్టుబడి ఉంటారో.. ఎందరు వదలించుకుంటారో వేచిచూడాలి. 
అసలే ప్రభుత్వం మీద విమర్శల దాడులు చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నిస్తేజంగా ఉన్నదని దిగ్విజయసింగ్‌ అక్షింతలు వేసి, వారిలో ఒక ఆవేశం రగిలించిన నాలుగురోజులకే పార్టీకి ఈ పెద్ద దెబ్బ పడిరది. ఈ సమయంలో మరింత దూకుడుగా అధికార పార్టీమీద విరుచుకుపడుతూ అఫెన్సివ్‌్‌గా  వెళ్లాలా, ముందు తమ పార్టీ దెబ్బతినకుండా కాపాడుకునేలా డిఫెన్సివ్‌గా వెళ్లాలా తెలియక కాంగ్రెస్‌ శ్రేణులు కంగారుపడిపోతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: