ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి బెయిలు లభించిన వ్యవహారాన్ని హైకోర్టు దశ దాటిన తర్వాత.. తాత్కాలికంగా పక్కన పెట్టి ఉంటే తెలంగాణ సర్కారుకు ఒక రకంగా పరువుగా ఉండేది. వక్రమార్గంలో బెయిలు తెచ్చుకున్నారని.. ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందేనని తిట్టుకుంటూ గడిపేసి ఉండవచ్చు. కానీ ఈ వ్యవహారాన్ని ‘పర్సనల్‌’గా తీసుకున్నట్లుగా వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పైగా రాష్ట్ర ప్రభుత్వ ఏజీ, సుప్రీంలో రాష్ట్రప్రభుత్వం కోసం ఒక న్యాయవాది ఇందరున్నప్పటికీ.. ప్రత్యేకించి దేశంలోనే కొమ్ములు తిరిగిన కాస్ట్‌లీ న్యాయవాదుల్లో ఒకరైన కపిల్‌సిబల్‌ను పెట్టుకున్నారు. ఆయన వాదనలు వినిపించారు. మొత్తానికి రేవంత్‌ బెయిల్‌ను రద్దు చేయాలనే వీరి పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. అయితే ఇప్పుడు కపిల్‌సిబల్‌ను పెట్టుకోవడం వలనే కేసు మరీ తేలిగ్గా కొట్టేసారని, సర్కారీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. 
సుప్రీం కోర్టు న్యాయవాదులు కొందరు సాధారణంగా నిమిషానికి కొన్ని లక్షల రూపాయల వంతున ఫీజులు వసూలు చేస్తుంటారు. న్యాయస్థానంలో వారు ఎన్ని నిమిషాలు వాదనలు వినిపిస్తే (మాట్లాడితే) ఆ సమయాన్ని బట్టి లక్షల రూపాయలు చెల్లించాలన్నమాట. ఈ రేంజి న్యాయవాదులు కొందరుంటారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కూడా చేసిన కపిల్‌ సిబల్‌ ఈ రేంజి న్యాయవాది అని అందరూ అనుకుంటూ ఉంటారు. రేవంత్‌ బెయిల్‌ను కొట్టేయించడానికి తెలంగాణ సర్కారు భారీ ఫీజులకు సిద్ధపడి కపిల్‌ సిబల్‌ను నియమించుకుంది. సుప్రీంలో తమకు సొంత న్యాయవాదులుండగా, కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలిసిన ఏజీ కూడా వెళ్లగా సిబల్‌ ఎందుకో వారికే తెలియాలి. 
అయితే వాదనలు వినిపించిన సిబల్‌ మధ్యలోనే మడమ తిప్పేశారు. గతంలో మీరు హైప్రొఫైల్‌ వ్యక్తులు అరెస్టయిన మరురోజే వారి బెయిల్‌ కోసం వాదనలు వినిపించారు. ఇప్పుడు రేవంత్‌ నెలరోజులు జైల్లో ఉన్న తరువాత.. వచ్చిన బెయిల్‌ రద్దును కోరడం ఏంటి? అని న్యాయమూర్తి ప్రశ్నించగానే సిబల్‌ గొంతులో తడారిపోయింది. బెయిల్‌ రద్దు గురించి కాదని, ఎలా ఇచ్చారనేది తెలియలేదని కొత్త పాట అందుకున్నారు. 50 లక్షలు ఎక్కడినుంచి వచ్చాయో లెక్క తేలే వరకు బెయిల్‌ ఇవ్వరాదన్న సిబల్‌ మాటకు విలువ లేకుండా పోయింది. మొత్తానికి కేసు కొట్టేశారు.
సిబల్‌ వాదనల్ని సమర్థంగా వినిపించలేదని ఇప్పుడు సర్కారు వారు తలలు పట్టుకుంటున్నారట. రేవంత్‌ కేసు ప్రభుత్వానికి ఎంత ‘ఇజ్జత్‌ కీ సవాల్‌’ గా మారిందో దాన్ని తలకెక్కించుకున్న సొంత న్యాయవాదులు, ఏజీలతోనే వ్యవహారం నడిపి ఉంటే బాగుండేదని, తెలంగాణ సర్కారు ‘ఎమోషన్‌’తో కనెక్ట్‌ కాలేని సిబల్‌కు భారీ ఫీజులు చదివించుకోవడం వృథా అయిందని వాపోతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: