ఓటు కు నోటు వ్య‌వ‌హారంలో రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌కే మ‌చ్చ‌ను మిగిల్చీ, నెల‌రోజుల జైలు  జీవితం గ‌డిపి అట్ట‌హాసంగా, భారి ర్యాలీతో విడుద‌లైనా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే మందు ప‌ధ్నాలుగు నెల‌లు ఖైదు జీవితం అనుభ‌వించి 3 నెల‌ల తాత్కాలిక బెయిల్  పొందిన జిఎన్. సాయిబాబా గురించి మాట్లాడుకొవాలి. నోట్ల క‌ట్ట‌ల‌తో ఓటు ను కొనాలని భావించిన నిందితుడితో ఒక విప్ల‌వ‌మేదావిని పోలుస్తారా అని సాయిబాబా మిత్రుల‌కు అభ్యంత‌రం ఉండ‌వ‌చ్చు. పోలిక వ్య‌క్తిత్వాల‌కు కాదు, వారి వారి రాజ‌కీయాలకు కాదు, నేరాన్ని స‌మాజ‌ము వ్య‌వ‌స్థాప్ర‌భుత్వ‌యంత్రాగాలు ఎట్లా చూస్తాయ‌న్న చ‌ర్చ‌లో ఈ ఉదంతాలు ప్ర‌సంగికాంశాలు మాత్ర‌మే. ఏదో ఘ‌న కార్యం చేసిన వీరుడిలాగా రేవంత్ను ఆయ‌న అభిమానులు ఎలా చూడ‌గ‌లుగుతున్నారు?  త‌న‌ను  తాను ఒక యోధుడిలాగా రేవంత్ రెడ్డి ఎట్లా భావించ‌గ‌లుగుతున్నారు?

డ‌బ్బులిస్తూ ప‌ట్ట‌బ‌డ్డ రేవంత్


నోటు తోఓట్ల‌ను కొనుక్కోవ‌డం అన్న‌ది వ‌రక‌ట్నం తీసుకోవ‌డం వంటి సంప్ర‌దాయంగా మారిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం 50 ల‌క్ష‌ల డ‌బ్బులిస్తూ ప‌ట్ట‌బ‌డ్డ రేవంత్ ను చ‌ట్టం శిక్షించ‌డం త‌ప్పేమి కాదు.  రాజ‌కీయ క‌క్ష‌తో, ప్ర‌భుత్వం మీద పోరాడుతున్నందుకు ప‌గ‌తో ప్ర‌భుత్వం త‌న‌ని జైలు లో పెట్టింద‌ని రేవంత్ అనుకుంటున్నారు. ఆయ‌న అభిమానులు అలాగే న‌మ్ముతున్నారు.  ప్రభుత్వ పక్షం వాదించేవారు కూడా దానిని పెద్దగా ఖండిస్తారని అనుకోను. ఎదుటిపక్షం వారిని ప్రలోభపెట్టి తమవైపు లాక్కోవడం ప్రభుత్వం కూడా చేస్తూనే ఉన్నది కదా? తెలుగుదేశం పార్టీ శత్రువైనప్పుడు, దానిని దెబ్బతీసే అవకాశం తెలంగాణకు మేలుచేసేదే కదా అన్నది వారి వాదం. నిజానికి ఇందులో రాజకీయ ప్రయోజనాల అంశం తప్ప మరొకటి లేదు. రాజకీయంగా ఎవరు ఎటువైపు ఉన్నారన్న దానిపై ఆధారపడి వారి వారి అన్వయాలు ఉంటున్నాయి.

సాయిబాబా ఒక మేధావి


రాజకీయ బాధితుడిగా అనుభ‌వం రేవంత్ కు త‌న భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు కొత్త పెట్ట‌బ‌డిగా పనికి వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు. స‌హ‌జ‌మే క‌దా? సాయిబాబా ఒక మేధావి. ఢిల్లీ లో ప్రొఫెస‌ర్. అయ‌న‌కు 90 శాతం వైక‌ల్యం ఉంది. ఆర‌ణ్య ప్రాంతాల‌లో కేంద్రీకృత‌మైన మావోయిస్టు ఉద్యమానికి ఆయ‌న మ‌హాన‌గ‌ర బ‌హిరంగ జీవితం నుంచి దోహ‌దం చేస్తున్నారని ఆయ‌న పై అభియోగం, స్వ‌యంగా కద‌ల‌లేని, స‌హాయం లేనిదే సొంత ప‌నులు కూడా చేసుకొలేని, ఇత‌ర‌త్రా అనేక అనారోగ్యాలు క‌లిసిన వ్య‌క్తిని హై సెక్యూరిటీ కారాగారంలో బంధించి ఉంచ‌క‌పోతే, ఈ దేశ భ‌ద్ర‌త ను కాపాడ‌లేమా? ఆ బ‌ల‌హీన‌మైన శ‌రీరంలో సుడుతు తిరిగే భావాల నుండి, ఆలోచ‌న‌ల నుంచి ఘ‌న‌త వ‌హించిన భార‌త ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ త‌న‌ను తాను ప్రజాస్వామికంగా ర‌క్షించుకోలేదా? అన్న ప్రశ్నలు ఈ పధ్నాలుగునెలల కాలంలో అనేకమార్లు వినిపించాయి.


వీడియో విచారణలో సాయిబాబా దుస్థితిని చూసి న్యాయమూర్తి స్వయంగా బెయిల్‌ కోరమని సూచించిన తరువాత కూడా ప్రాసిక్యూషన్‌ అందుకు సహకరించలేదు. ఒక జాతీయ ఆంగ్ల వారపత్రిక ఆయన ముఖచిత్రంతో కథనం ప్రచురించింది. దేశవిదేశాలలో మేధావులు విజ్ఞప్తులు చేశారు. ధర్నాలూ ఊరేగింపులూ సరేసరి. పాలకశ్రేణుల మధ్య రాజకీయక్రీడలో భాగస్వామిగా కాక, మొత్తంగా పాలకవ్యవస్థకే ఎదురొడ్డిన నేరానికి అతనికి కనీసపు ఊరట దొరకడానికి ఇంతకాలం పట్టింది. బహుశా ఏ ర్యాలీలూ పూలవర్షాలూ ఆయనకు స్వాగతం చెప్పివుండవు. మన వ్యవస్థకు సాధారణార్థంలో విశ్వసనీయత తక్కువ. ఎప్పుడూ బోనెక్కరని అనుకోని వ్యక్తులపై చట్టం అరుదుగా గురిపెట్టినప్పుడు అందుకే సాధారణజనంలో ఒక ఆనందం కలుగుతుంది. చట్టం ముందు అందరూ సమానులేనేమోనన్న భ్రమ పెరుగుతుంది. 

సాయిబాబాను సుదీర్ఘకాలం బంధించడంలో ప్రాసిక్యూషన్‌

సాయిబాబాను సుదీర్ఘకాలం బంధించడంలో ప్రాసిక్యూషన్‌ సఫలం అయింది కానీ, అటువంటి వ్యక్తిని అంతగా బాధించడం వ్యవస్థను డిఫెన్స్‌లోకి కూడా నెట్టింది. సమర్థన కూడా సాధ్యం కాని దుర్మార్గానికి పాల్పడినప్పుడు ఎంతో కొంత దిద్దుబాటుకు పూనుకోవలసి వస్తుంది. మరి రేవంత్‌ ఉదంతం చుట్టూ అలముకున్న నేరవాతావరణం నుంచి ఉభయరాష్ట్ర ప్రభుత్వాలూ ఎట్లా బయటపడతాయి? రేవంత్‌ విడుదలయినా, కేసు మిగిలే ఉన్నది. నోటుకు ఓటు అయినా, దానికి పోటీగా ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన ట్యాపింగ్‌ కేసు కానీ ఎట్లా పరిష్కారం అవుతాయి? ప్రభుత్వాల క్రీడ నడుమ వ్యవస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకం కావడం లేదా? రేపిస్టులూ బాధితులూ రాజీపడితే చెల్లదని సుప్రీంకోర్టు తాజాగా చెప్పింది. 


మరి నీ కేసుకు నా కేసు చెల్లు, ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ అనుకుంటే, చట్టం ఒప్పుకుంటుందా? వ్యవస్థ మీద నమ్మకం చెదరకుండా ఉంటుందా? చూడాలి. ఎన్నో దొంగతనాలు జరిగే లోకంలో కొన్ని మాత్రమే కేసులవుతాయి. కొన్నిటికి మాత్రమే శిక్షలు పడతాయి. రేవంత్ రెడ్డికి బెయిల్ రావ‌డం, మ‌రోవైపు ప్రొ సాయిబాబాకు తాత్కాలిక స్వేచ్చ దొర‌క‌డం వ‌ల్ల న్యాయం ఎటువైపు ఉన్న‌దో ఇప్పుడు తెలియాల్సి ఉంది. విర్రవీగే నేరస్థులూ ఉంటారు. కష్టాలు పడే సజ్జనులూ ఉంటారు. బరిలోపలే కూతపెడుతూ సంచరించేవారు బోనెక్కినా సురక్షితంగా తొడలు కొడుతూనే ఉంటారు. ‘బరి’ తెగించినవారు మాత్రం ఔట్‌ అవుతారు.



మరింత సమాచారం తెలుసుకోండి: