కాంగ్రెసు పార్టీ సర్వసేనానులుగా సేవలందించిన నాయకులే ఒక్కరొక్కరుగా.. కాడి పక్కన పారేసి వెళ్లిపోతూ ఉంటే.. ఆ పార్టీలో మిగిలి ఉన్న వారికి లోలోపల ఎలా ఉంటుంది? వారి మీద మంట చెలరేగిపోతూ ఉంటుంది? వారి ఫోటో కనిపించినా కూడా కుతకుతలాడిపోతారు. అవును మరి.. గాంధీభవన్‌లో కూడా అదే జరిగింది. గతంలో పీసీసీ చీఫ్‌లుగా పనిచేసిన వాళ్లు.. ఇప్పుడు.. తమ తమ అవసరాలకోసం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోగా.. ఉన్న నాయకులు వారి మీద రేగిన కోపాన్ని ఆపుకోలేకపోయారు. వారి ఫోటోలను పీకి పారేసారు. వారి మీద అక్కసును వెళ్లగక్కడానికి పాపం.. ఓ సీనియర్‌ నాయకుడికి చాలా తెగువ వచ్చేసింది గానీ.. దాన్ని ప్రదర్శించడానికి ఆయన హైట్‌ చాల్లేదు. 
గాంధీభవన్‌లో శనివారం నాడు ఓ తమాషా జరిగింది.
సాధారణంగా పార్టీ కార్యాలయం గనుక.. అక్కడ గతంలో పీసీసీ చీఫ్‌లుగా పనిచేసిన వారందరి ఫోటోలు ఫ్రేములు కట్టించి ఉంచుతారు. అయితే.. ఇటీవలి కాలంలో.. కాంగ్రెసు పార్టీ పరిస్థితి దయనీయంగా మరిపోయాక.. ఎవరికి వారు తమ తమ దార్లు చూసుకుంటున్నారు. గతంలో జగన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన తర్వాత.. కొందరు గాంధీభవన్‌లో బలవంతంగా వైఎస్‌ ఫోటోను తీసేయించారు. (నిజానికి, వైఎస్‌ పార్టీకి ఎన్నడూ దూరం కాలేదు. కాంగ్రెస్‌ నేతగానే చచ్చిపోయారు). 
శనివారం.. గాంధీభవన్‌కు వచ్చిన సీనియర్‌ నేత వీ హనుమంతరావుకు వేరే పార్టీల్లో ఉన్న మాజీ పీసీసీ చీఫ్‌ల ఫోటోలు గోడల మీద కనిపిస్తూ చిరాకు కలిగించాయి. ఆయనకు ఆగ్రహం వచ్చేసింది. ఎన్నడో పార్టీ వీడిపోయిన కేకేశవరావు సహా, ఇటీవల వెళ్లిన బొత్స సత్యనారాయణ, డీఎస్‌ ఫోటోలూ ఉన్నాయి. ఆయన ఆగ్రహంతో వాటిని స్వయంగా తీసి పారేసేందుకు పూనుకున్నారు. గోడమీది ఫోటోలు తనకు అందవు గనుక.. కష్టపడి ఓ బల్ల మీదికి ఎక్కారు. అయినా ఒకటి రెండు ఫోటోలు తీయగలిగారు గానీ, మరోటి తీయడం కుదర్లేదు. కాసేపు ఆపసోపాలు పడ్డారు. ఇంతలో ఆయన బాధ గమనించి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి ఆ బల్ల మీదకు ఎక్కి ఆ ఫోటోను తొలగించారు. ఆ తర్వాత వీహెచ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ.. పార్టీకి ద్రోహం చేసిన మాజీ పీసీసీ చీఫ్‌ల మీద కారాలు మిరియాలు నూరారు.
అంతా బాగానే ఉంది. కానీ పాపం.. ఆయన ఆగ్రహం వెళ్లగక్కదలచుకున్న సమయానికి ఫోటోలు స్వయంగా తొలగించడానికి  ఆయన హైట్‌ చాలక చిక్కొచ్చి పడిరదే.. అని సీను గమనించిన వారు నవ్వుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: