కొన్నిరోజులుగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు దర్యాప్తు మళ్లీ జోరందుకుంటున్నట్టు కనిపిస్తోంది. సెంకడ్ ఫేజ్ లో దూకుడు పెంచే వ్యూహం కనిపిస్తోంది. ఈ కేసులో జిమ్మి అనే ఓ కొత్త ముఖాన్ని వెలుగులోకి తేవడం సంచలనానికి కారణమవుతోంది. ఈ జిమ్మీ లోకేశ్, చంద్రబాబుల ప్రధాన అనుచరుడంటూ వస్తున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. 

ఓటుకు నోటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, మత్తయ్యలతో పాటు జిమ్మీది కూడా మెయిన్ రోలేనట. ముందుగా మత్తయ్యతో సంప్రదింపులు సాగించిన సూత్రధారులు.. ఆ తర్వాత జిమ్మీని రంగంలోకి దించి సెబాస్టియన్, రేవంత్ ద్వారా కొనుగోలు వ్యవహారం నడిపించారని ఏసీబీ అనుమానిస్తోందట. ఇంతకీ ఈ జిమ్మీ ఎవరంటే.. కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందినవాడు. గతంలో రామగుండం కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. చాలాకాలంగా మల్కాజిగిరిలో ఉంటున్నాడు. 

ఆట..  సెకండ్ ఫేజ్ మొదలైందా..?


జిమ్మీ లోకేశ్, చంద్రబాబులకు కీలక అనుచరుడని.. వీరికి సంబంధించిన అనేక చీకటి వ్యవహారాలు జిమ్మీ చక్కబెడతాడని కేసీఆర్ పత్రిక కథనం వెలువరించింది. చంద్రబాబు పాదయాత్ర సమయంలో ప్రతిక్షణం ఆయనతోపాటే జిమ్మీ ఉన్నాడంటూ కొన్ని ఫోటోలు కూడా ప్రచురించింది. జిమ్మీ లోకేష్, బాలకృష్ణలతోనూ సన్నిహింతగా తిరుగుతాడని తెలిపింది. 

సెబాస్టియన్‌తో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు గాలం వేయడం, రేవంత్‌తో సెటిల్‌మెంట్ చేయించడం.. ఇలా పూర్తిగా కుట్రలో అత్యంత కీలకంగా వ్యవహరించింది జిమ్మీయే అని ఏసీబీ దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్టు ఆ పత్రిక తెలిపింది. స్టీఫెన్‌సన్‌కు రేవంత్ ఇప్పజూపిన 50లక్షల రూపాయలను పారిశ్రామిక వేత్తలు, రాజ్యసభ ఎంపీల నుంచి తీసుకువచ్చింది జిమ్మీయే అయి ఉంటాడని రాసింది. స్టీఫెన్ సన్ తో పాటు మిగిలిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ జిమ్మీది ప్రధాన పాత్ర అయి ఉండొచ్చని ఆ పత్రిక జోస్యం చెప్పింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: