అంబేద్కర్‌, తెలుగు యూనివర్సిటీల సేవలను పొందే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాసులకు ఊరట కలిగింది. ఆ రెండు విశ్వవిద్యాలయాల ప్రధాన కార్యాలయాలు హైదరాబాదు నగరంలో ఉన్నందున అవి తమకు మాత్రమే చెందుతాయంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించేసి, ‘ఏపీ కి చెందిన వారికి ఎడ్మిషన్లు ఉండబోవు’ అనే వాతావరణాన్ని సృష్టించిన కొన్ని వారాల తర్వాత ఈ విషయంలో ప్రతిష్టంభన వీడిరది. అయితే... ఈ వివాదం ముదిరిన నాటినుంచి.. పైకి మౌనంగానే కనిపిస్తూ వచ్చినా.. తెరవెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడిపిన మంత్రాంగం కారణంగానే... ఏపీకి ఈ మేలు జరిగిందని అంతా అనుకుంటున్నారు.
ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి విద్యాపరంగా ఇటీవల  ఒక నష్టం పొడసూపింది. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలు మొత్తం 23 జిల్లాలకు సేవలు అందిస్తూ ఉండేవి. అయితే ఇటీవల ఇవి తమ రాష్ట్రానికి మాత్రమే చెందుతాయంటూ తెలంగాణ ప్రభుత్వం క్లెయిం చేసుకుంది. తమ ప్రాంతంలో ఉన్నందున హక్కులు తమవే అని పేర్కొన్నది. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ సేవలు ఆగిపోతే.. ఏపీలోని విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుందికూడా! ఏపీ కొత్తగా ఎగ్రిమెంటు చేసుకుంటేనే... సేవలు అందిస్తామని వర్సిటీవారు ప్రకటించారు. అంటే.. తెలంగాణకు చెందిన  యూనివర్సిటీనుంచి సేవలను ఏపీ కొనుక్కోవాలన్నమాట. ఆ ప్రతిపాదనకు ఏపీ సర్కార్‌ దిగిరాకపోవడంతో.. వర్సిటీ సేవలు ఆపేసింది. ఎంట్రెన్సు రిజల్టు కూడా ఏపీ జిల్లాల కుసంబంధించి రిలీజు చేయలేదు. సరిగ్గా ఇక్కడే చంద్రబాబు మంత్రాంగం జోక్యం చేసుకున్నట్లు ప్రస్తుత ఫలితం కనిపిస్తోంది.
 ప్రస్తుతానికి ఈ రెండు విశ్వవిద్యాలయాల విషయంలో యథాపూర్వ పరిస్థితే కొనసాగుతుందని... నిరుడిలాగే రెండు రాష్ట్రాల వాసులకు ఉమ్మడిగానే ఎడ్మిషన్లు ఇవ్వాలని ఆదేశిస్తూ ఉభయ రాష్ట్రాల గవర్నరు ఆదేశాలు ఇచ్చారు. అంటే కొత్త ఒప్పందాలతో నిమిత్తం లేకుండా అవి ఏపీకి కూడా బేషరతు సేవలందించాలన్నమాట. వర్సిటీ మాదే అని తెసర్కారు చెప్పుకుంటే ఆ సేవల కర్చులు వారు భరించాలి. అంతే తప్ప సేవలు ఆగడానికి వీల్లేదని అనుకోవాలి. 
నిజానికి ఈ గవర్నరు ఆదేశాలు, తెలంగాణ సర్కారుకు ఎదురుదెబ్బ అనుకోవాలి. వీటిని కేసీఆర్‌ పాటిస్తారా.. తిరస్కరిస్తారా.. అనేది కూడా కీలకమైన అంశం. ఇప్పటికే రకరకాల చిక్కులు ఎదురవుతూ ఉన్న నేపథ్యంలో మళ్లీ ఈ యూనివర్సిటీల వివాదాన్ని కూడ కేసీఆర్‌ నెత్తికెత్తుకుంటారా? గవర్నరుతో కూడా సున్నం పెట్టుకుంటారా?  ఆంధ్రప్రాంతం మీద పనిగట్టుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే మరో సంకేతాన్ని కేంద్రానికి పంపుతారా? అనేది వేచిచూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: