రేవంత్‌రెడ్డి ప్రస్తుతం బెయిలు మీద కొడంగల్‌ నియోజకవర్గంలో ఉన్నారు. రాజకీయాలు మాట్లాడడానికి మీడియా అత్యధికంగా అందుబాటులో ఉండే హైదరాబాదు నగరంలో ఉండడానికి అవకాశం లేకపోవడం, బహుశా ఆయనకు చింత, దిగులు కలిగిస్తుండవచ్చు. అయితే.. బెయిల్‌ ఉత్తర్వుల్లో ఆయన్ను కేవలం కొడంగల్‌కు మాత్రమే పరిమితం చేస్తూ నియోజకవర్గం దాటి వెళ్లకూడదని కోర్టు చెప్పడం వలన ఆయన ఒక తలనొప్పిని మాత్రం తప్పించుకున్నారు. 
ఓటు కు నోటు కేసులో అరెస్టు అయింది ముగ్గురు నిందితులే. ఏ1 రేవంత్‌ అయితే, మిగిలిన ఇద్దరు సెబాస్టియన్‌, ఉదయసింహ లకు కూడా బెయిల్‌ వచ్చింది. అయితే ఆ ఇద్దరికీ కోర్టు ఒక నిబంధన విధించింది. దాని ప్రకారం వారిద్దరూ ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 లోగా ఏదో ఒక సమయంలో వారికేసును విచారిస్తున్న ఏసీబీ వారి కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లాలి. ప్రతిరోజూ వారు ఇలా సంతకాలు చేస్తూ ఉండాల్సిందే. నిజానికి ఇది చాలా పెద్ద చికాకు. బెయిలు మీద బయట ఉన్నట్లే ఉంటుది గానీ.. ప్రతిరోజూ పోలీసు స్టేషనుకు, ఏసీబీ ఆపీసుకు వెళ్లి రావడం కంటె.. జైల్లో ఉండడమే బెటర్‌ అని ఒక దశలో అనిపించినా ఆశ్చర్యం లేదు. 
అయితే అసలు ఏ1 అయిన రేవంత్‌రెడ్డి మాత్రం ఈ ఇబ్బందిని చాలా సునాయాసంగా తప్పించుకున్నారు. బెయిల్‌ మీద కొడంగల్‌ నియోజకవర్గం దాటి బయటకు రావడానికి వీల్లేదని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆయన తన ఊరిలోనే ఆగిపోయారు. బెయిల్‌ ఉత్తర్వుల్లో అలాంటి నిబంధన పుణ్యమాని ప్రతిరోజూ ఏసీబీ వారి వద్దకు వెళ్లి సంతకం పెట్టి హాజరు వేయించుకునే దుస్థితి ఆయనకు తప్పింది. కాకపోతే.. పదేపదే మీడియా ముందుకు వచ్చి.. కేసీఆర్‌ సర్కారును ఆడిపోసుకోవడానికి తమ నేతకు అవకాశం తగ్గిందని అనుచరులు అనుకుంటున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: