ఇప్పటివరకూ సాఫ్ట్ వేర్ కంపెనీల ప్రాంతంగా పేరుపడిన మాదాపూర్.. భవిష్యత్తులో రాజకీయాల కేంద్రంగా కూడా మారబోతోందా.. ఇప్పటికే ట్రాఫిక్స్ కష్టాలు మొదలైన మాదాపూర్ లో ఇక ముందు మరిన్ని ఇక్కట్లు రానున్నాయా.. అంటే.. అవుననే అనిపిస్తోంది. తెలంగాణ సచివాలయం, అసెంబ్లీలను మాదాపూర్లో ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం విశేషం. 

ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేని సచివాలయం, అసెంబ్లీలను అక్కడి నుంచి తరలించేయాలన్న టీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన మాత్రం కొనసాగుతూనే ఉంది. మొదట్లో ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి స్థలాన్ని అందుకు వినియోగించాలని అనుకున్నారు.  దాదాపు 200 కోట్లు నిధులు కూడా మంజూరు అయినట్లు వార్తలొచ్చాయి. ఆసుపత్రి సిబ్బంది నుంచి వ్యతిరేకతరావడంతో దాన్ని పక్కన పెట్టారు. 

మాదాపూర్ భూములపై కేసీఆర్ సర్కారు కన్ను.. 


ఆ తర్వాత సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ స్థలంలో సెక్రటేరియట్ కడితే ఎలా ఉంటుందని ఆలోచించారు. ఐతే.. ఆ స్థలం ఆర్మీ ఆధీనంలో ఉండటంతో కేంద్ర రక్షణ శాఖ ను కూడా ఈ స్థలం ఇమ్మని సాక్షాత్తూ కేసీఆరే వెళ్లి విజ్ఞప్తి చేశారు. ఆ ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. దీంతో ఇప్పుడు కొత్తగా మళ్లీ భూమి కోసం వెదుకులాట మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. 

మాదాపూర్లోని హైటెక్ సిటీ పక్కనున్న శిల్పారామం వెనుక దాదాపు 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సచివాలయం, అసెంబ్లీ, పరిపాలన భవనాలు అన్నీ ఒకే చోట ఉండేలా ప్లాన్ చేస్తున్నామని అందుకు ఈ భూమి ఒక ఆప్షన్ గా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వాస్తవానికి అసెంబ్లీ, సెక్రటేరియట్ ల మార్పు ఇప్పుడు అంత అవసరం లేని ప్రక్రియ. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్, అసెంబ్లీ తెలంగాణ అవసరాలకు భేషుగ్గా సరిపోతాయి. మరో పదేళ్లలో ఎలాగూ ఏపీ భవనాలు ఖాళీ అవుతాయి. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం కొత్త భవనాలపైనే మోజు పెంచుకుంటోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: