వ్యాపం కుంభ‌కోణం- ఇది కేవ‌లం కుంభ‌కోణ‌మే కాదు, భార‌త్ దేశాన్ని వ‌ణికిస్తున్న ఓ క్రైం థిల్ల‌ర్ స్టోరీ. మ‌ద్య ప్ర‌దేశే కాదు, దేశ రాజ‌కీయలకు సంచ‌ల‌నానికి కేంద్ర‌బిందువుగా మారింది. ఈ కుంభ‌కోణంలో కోట్లాది రూపాయ‌లు కొల్ల‌గొట్టార‌నో, పెద్ద పెద్ద రాజ‌కీయనాయ‌కులు ప్ర‌మేయం ఉంద‌నో, గ‌వ‌ర్న‌ర్ స్థాయి వ్య‌క్తి కూడా ఉన్నార‌నో కాదు. ఈ కుంభ‌కోణానికి సంబందించి న వ్య‌క్తులు నిందితులే కావచ్చు, సాక్షులే కావ‌చ్చు, ఒక్కోక్క‌రు గా అనుమానాస్ప‌దంగా మ‌ర‌ణిస్తుండ‌టం ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. అసలు ఎందుకు చ‌స్తున్నారో, ఎవ‌రైనా చంపుతున్నారా.. లేక వారే ఆత్మహ‌త్య‌కు పాలుప‌డుతున్నారా అర్ధం కాని ప‌రిస్థితి. ఇప్ప‌టికి సాక్షుల‌తో కలిసి 48 మంది మ‌ర‌ణించిన‌ట్లు లెక్క‌లో తేలింది. అయితే ఇందులో స‌గం మందికి పైగా స‌హ‌జ మ‌ర‌ణించార‌ని పోలీసులు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 23 మంది అస‌హ‌జ ప‌రిస్థితుల్లో మ‌రణించిన‌ట్లు ఈ కుంభ కోణం పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్న సిట్ హైకోర్టు కు గ‌త వారం నివేదించింది.

మధ్యప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్‌ (వ్యాపమ్‌)


అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులపై విచారణ చేస్తూనే ఉంది. చనిపోయేవారు చనిపోతూనే ఉన్నారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు, అధికారులు, గుమాస్తాలు అందరూ ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నారు. మధ్యప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్‌ (వ్యాపమ్‌)లో 2004 లోనే ఈ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఏడాది జరిగిన ప్రవేశపరీక్షలలో పెద్దఎత్తన అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారంలో ఉన్నవారెవరూ ఆ ఆరోపణలను పట్టించుకోలేదు.


ఇది కోట్లాది రూపాయలు చేతులు మారిన మామూలు కుంభకోణం కాదు. ఒకరో ఇద్దరో లేదా కొందరు కలిసి చేసిన ఆర్ధిక నేరం కాదు. కోట్లాది రూపాయలు వందలాది చేతులు మారి దశాబ్దానికి పైగా జరుగుతూనే ఉన్న విచిత్రమైన కుంభకోణం ఇది. అనర్హులను ఉద్యోగాల్లోకి జొప్పిస్తూ, అర్హత లేని వారికి ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తూ చేసిన దేశద్రోహం లాంటి నేరం ఇది. మరీ ముఖ్యంగా పోలీసు రిక్రూట్‌మెంట్‌లో, వైద్య విద్యలో అనర్హులను ప్రవేశపెట్టడమంటే దేశం ద్రోహం కాక మరేమిటి?

విచిత్రం ఏమిటంటే కుంభకోణంలో పాలుపంచుకున్న వారు, సాక్షు


ఇందులో మరో విచిత్రం ఏమిటంటే కుంభకోణంలో పాలుపంచుకున్న వారు, సాక్షులు కూడా ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్న దారుణ కుట్రపూరిత నేరం ఇది. ఇప్పటి వరకూ ఈ కుంభకోణంలో నిందితులైన వారు, సాక్ష్యులు కలిపి మొత్తం 48 మంది వివిధ రకాలుగా అనుమానాస్పదంగా మరణించారంటే అంతకన్నా పోలీసు వైఫల్యం మరొకటి ఉండదు. అంతేకాదు అక్రమాలు చేసేవారు మరింతగా రెచ్చిపోయారు. దాంతో 2009 లో మెడికల్‌ అడ్మిషన్లలో అక్రమాలు జరిగినట్లు మరింత తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆ ఏడాది వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో అనర్హులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో ఈ ఆరోపణలను కప్పిపుచ్చే వీలులేనందున మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఒక కమిటీని నియమించింది. ఈ కేసుకు సంబంధించిన ప్రాధమిక ఆధారాలు లభ్యం అయ్యాయని ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో ఈ కేసు దర్యాప్తు కోసం 2012లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.


 కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ కుంభకోణానికి సంబంధించి దాదాపు రెండు వేల మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు. వారిలో లక్ష్మీకాంత్‌ శర్మ అనే ఆ రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి, పలువురు రాజకీయ నాయకులు, బోర్డు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విద్యార్ధులు వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ కుంభకోణంలో నమ్రతా దామోర్‌ అనే విద్యార్ధి పేరు ప్రస్తావనకు వచ్చింది. అంతే ఆ అమ్మాయి ఆ తర్వాత రైల్వే ట్రాక్‌ సమీపాన శవమై కనిపించింది. ఈ విషయంపై నమ్రతా దామోర్‌ తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసేందుకు టీవీ టుడే గ్రూపు సంస్థ చానల్‌కు చెందిన ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్‌ అక్షయ్‌ సింగ్‌ వెళ్లాడు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత అతడు నోటివెంట నురగ కక్కుకుని మరణించాడు. ఈ సంఘటన జరిగి 24 గంటలు తిరక్క ముందే జబల్పూర్‌ మెడికల్‌ కాలేజి డీన్‌ అరుణ్‌ శర్మ మృతదేహం ఢిల్లీలోని ఓ హోటల్‌ గదిలో కనిపించడం అన్ని వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

 ఢిల్లీ నగరంలోని ద్వారకా హోటల్‌


 ఢిల్లీ నగరంలోని ద్వారకా హోటల్‌ గదిలో ఆదివారం ఆయన మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దాదాపుగా ఖాళీ అయిన ఓ మద్యం బాటిల్‌, ఆయన చేసుకున్న వాంతి హోటల్‌ గదిలో కనిపించాయి. ఫోరెన్సిక్‌ సాక్ష్యాలను సేకరించిన తర్వాత ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే ఈ మరణానికి కుంభకోణానికి సంబంధం లేదని ప్రభుత్వం హడావుడిగా ప్రకటించేసింది. గత ఏడాది కాలంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఈ కాలేజి డీన్లలో శర్మ రెండోవారు కావడంతో ఈ మృతి వెనుక కూడా ఏదో జరిగి ఉంటుందనే ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ముందు శర్మ స్థానంలో డీన్‌గా ఉన్న డికె సకాల్లే కూడా ఇదే తరహాలో తన ఇంట్లో చనిపోయి కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో పోలీసులు చెప్పడం గమనార్హం. మరోవైపు వ్యాపమ్‌ నియామకాల్లో ఎస్‌ఐ (ట్రైనీ)గా ఎంపికైనా అనామిక సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందడంతో దేశవ్యాప్తంగా సంచలనం నమోదైంది.


ఇలా ఒక‌రి తరువాత ఒక‌రు, ఇలా ఎంత మంది మ‌ర‌ణించాలో తెలియ‌దు. ఇన్ని మ‌రణాలు జ‌రుగుతుంటే చూస్తూ ఉరుకుంటుంది మద్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. ఈ కుంభ‌కోణం లో పెద్ద పెద్ద రాజ‌కీయ నాయ‌కుల హ‌స్తం ఉన్నందున ప్ర‌భుత్వం ఇబ్బంది ప‌డుతుంది కాబోలు. ఇలాగ‌యితే న్యాయం జ‌రిగేది ఎలా? ర నిజం బ‌య‌ట‌కు వ‌చ్చేది ఎలా? ఈ ఘ‌ట‌న పై సీబీఐ విచార‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కానీ మ‌ధ్య‌ప్ర‌దేశ్  లో, కేంద్రంలో  అధికారంలో ఉన్నది బీజేపీ నే. దీంతో సీబీఐ ద‌ర్యాప్తు నిష్పాక్ష పాతంగా జ‌రుగుతుందా? అనే అనుమానాలు రేక్కేత్తిస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ కూడా ఇదే ప్ర‌శ్న వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: