ఓటుకు నోటు కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అరెస్టు చేసిన తెలంగాణ ఏసీబీ తన రిమాండ్ డైరీలో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని ఏసీబీ తెలిపింది. ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన సెబాస్టియన్ తో.. సండ్ర మొత్తం 32 సార్లు మాట్లాడారట. సెబాస్టియన్ ఫోన్ లో రికార్డయిన సంభాషణలను తన నివేదికలో వివరించింది. 

ఓటుకు నోటు కుట్ర మొదలైన దగ్గర నుంచి కొనుగోలుకు యత్నం జరిగిన దాకా చోటు చేసుకున్న పరిణామాలన్నీ తన రిపోర్టులో తెలంగాణ ఏసీబీ వివరించింది. స్టీఫెన్‌సన్ కొనుగోలుకు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో జరిగిన టీడీపీ మహానాడు వేదికగానే కుట్ర జరిగిందని తెలిపింది. అంతేకాదు.. చంద్రబాబు నివాసం నుంచి కూడా ఈ కుట్ర అమలు చేసినట్టు రిమాండ్ డైరీలో ఇచ్చిన వివరణలో తెలిపింది.  

సండ్ర రిమాండ్ తో టీడీపీలో టెన్షన్..


మే 31న రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహాలను అరెస్ట్ చేసిన ఏసీబీ వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించింది. ల్యాబ్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక, సెల్‌ఫోన్ల నిశిత పరీశీలనతో సెబాస్టియన్ ఫోన్‌లో మే 23 నుంచి 31 వరకు రికార్డ్ అయి ఉన్న ఆడియోలు, ఫోన్ కాల్ నంబర్లను బట్టి కాల్ డాటా రికార్డులను తీసుకుంది. 

సండ్ర మొబైల్ నంబర్ నుంచి రేవంత్ ఫోన్ కు 24వతేదీ నుంచి 31 వరకూ 18 కాల్స్ వెళ్లాయి. సండ్ర రెండో నంబర్  నుంచి రేవంత్‌రెడ్డి రెండో నంబర్ కు 24వతేదీ నుంచి 31వరకు రెండుసార్లు కాల్స్ వెళ్లాయని కాల్ డాటాను బట్టి తేలింది. మరోవైపు.. ఏసీబీ నోటీసులు జారీ అయిన సమయంలో తాను వైజాగ్‌లో ఉన్నానని వీరయ్య న్యాయస్థానం ముందు చెప్పారు. తన స్వగ్రామం ఖమ్మం జిల్లాల్లో ఉందని, తన ఇద్దరు పిల్లలు వైజాగ్‌లో చదువుకుంటుండటంతో వారి వద్దకు వెళ్లానని వివరించారు. ఆరోగ్యం బాగాలేక అక్కడే ఆసుపత్రిలో చేరానని, ఏసీబీ నోటీసులకు స్పందించి లేఖ రాశానని, ఆరోగ్యం మెరుగైన తర్వాత కూడా మరో లేఖ పంపానని తెలిపారు. న్యాయమూర్తి సండ్రను 14 రోజులు రిమాండ్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: