పవన్ కల్యాణ్, చంద్రబాబు, నరేంద్రమోడీ.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వీరి మధ్య ఏర్పడిన బంధం దాదాపు ఏడాదిన్నరగా సజావుగానే సాగుతోంది. తానే ఓ పార్టీ అధినేతను అయినా ఎన్నికల బరిలో దిగకుండా బీజేపీ, టీడీపీ కూటమి విజయం కోసం రాష్ట్రమంతా తిరిగారు పవన్ కల్యాణ్. మొత్తానికి ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. 

గత ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కూటమి ఏపీలో విజయపథంలో సాగడంలో పవన్ కల్యాణ్ కూడా కీలక పాత్ర పోషించారన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అందుకే చంద్రబాబు ఏ నటుడికీ ఇవ్వనంత ప్రాధాన్యం పవన్ కల్యాణ్ కు ఇచ్చారు. ఆయనతో పలుసార్లు భేటీ అయ్యారు. ఏడాదిన్నరగా సజావుగా సాగుతున్న ఈ హనీమూన్ ఇక ముగిసినట్టే కనిపిస్తోంది. 

ఇక టీడీపీ వర్సెస్ పవన్.. 


రాజధాని భూముల సేకరణ సమయంలో మొదటగా పవన్ కల్యాణ్ టీడీపీతో విబేధించారు. బలవంతంగా భూములు లాక్కోకూడదని ప్రకటనలు చేశారు. రాజధాని భూముల్లో పర్యటనలు కూడా చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న పవన్.. లేటెస్టుగా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం ఎంపీలపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. తిడితే కేసీఆర్ లా తిట్టాలి.. పడితే సీమాంధ్ర ఎంపీల్లా పడాలి అంటూ సెటైర్లు వేశారు.       

సీమాంధ్ర ఎంపీలకు వ్యాపారాలున్నందువల్లే ఈ దుస్థితి వచ్చిందని పవన్ విమర్శించారు. అంతే కాదు.. సెక్షన్ 8 కు తాను వ్యతిరేకమని కుండబద్దలు కొట్టారు. ఇన్నాళ్లూ పవన్ ను విమర్శించాలంటే ముందూ వెనుకా ఆలోచించిన టీడీపీ నాయకులు ఇప్పుడు పవన్ పై దండెత్తుతున్నారు. కేశినేని నాని, సుజనా, కొనకళ్లనారాయణ, సోమిరెడ్డి.. ఇలా ప్రతి ఒక్కరూ పవన్ పై మండిపడుతున్నారు. చంద్రబాబు నుంచి సంకేతాలు లేకుండా ఈ స్థాయిలో నేతలు విరుచుకుపడరు. అంటే టీడీపీ- పవన్ హానీమూన్ ఇక ముగినట్టే భావించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: