పవన్ కల్యాణ్ సోమవారం పెట్టిన ప్రెస్ మీట్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రెస్ మీట్ ద్వారా పవన్ సాధించేమిటన్న అంశంపై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, ప్రత్యేక హోదా, సెక్షన్ 8 అంశాల నేపథ్యంలో పవన్ స్పందన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం ఎదురుచూశారు. అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతానంటూ సోమవారం మీడియా ముందుకు వచ్చిన పవన్ కు ఈ ప్రెస్ మీట్ ద్వారా మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందనిపిస్తోంది. 

ఇన్నాళ్లూ పవన్ కు అండగా నిలుస్తూ వచ్చిన టీడీపీ క్యాడర్, నాయకులు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా పవన్ కు విరోధులయ్యారు. విశేషమేమిటంటే.. ఓటుకు నోటు కేసుపై పవన్ ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా టీడీపీ నేతలు మాత్రం పవన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకంటే సీమాంధ్ర ఎంపీలపై ఆయన తీవ్రమైన కామెంట్లు చేశారు. ఇన్నాళ్లూ తాము గౌరవించిన పవన్ నే.. ఆరు నెలలకోసారి నిద్రలేచే మీకేం తెలుస్తుందని టీడీపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. 

పవన్.. రెంటికీ చెడ్డ రేవడి.. 


అలాగే.. పవన్ తన ప్రెస్ మీట్లో కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు. ఆయన విజయనగరం జిల్లావాసికి యాదాద్రి డిజైనింగ్ ఛాన్స్ ఇచ్చి మంచి సంప్రదాయానికి తెరతీశారని పొగిడారు. ఇది టీడీపీ వారికి కంటగింపుగా ఉంది. అందుకే తన సినిమాలు ఆడించుకోవడం కోసమే.. పవన్ కే్సీఆర్ భజన చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు పవన్ ప్రెస్ మీట్ పై టీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కేటీఆర్, హరీశ్ రావు, బాల్క సుమన్..ఇలా ప్రతి ఒక్కరూ పవన్ ను తప్పుబడుతున్నారు. పవన్ కల్యాణ్ కాదు ప్యాకేజీ కల్యాణ్ అని ఒకరంటే..పవన్ ఏడాదికోసారి వచ్చి సినిమా అని మరొకరు అన్నారు. మొత్తానికి అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు టీడీపీ నేతలు.. అంతా పవన్ నే తిడుతున్నారు. మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా పవన్ సాధించింది ఏమిటి.. ఇదే అర్థం కాని విషయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: