అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తూ.. పార్ట్ టైమ్ పొలిటీషిన్ గా పేరుబడిన పవన్ ఇక ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నారా.. అందుకు వేదికగా భాగ్యనగరంలోని సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారా.. అందుకే మొన్నటి ప్రెస్ మీట్లో ప్రత్యేకించి సనత్ నగర్ ప్రస్తావన తీసుకొచ్చారా.. ఈ ప్రశ్నలకు సమాధానం అవును అంటోందీ ఓ ఆంగ్ల దిన పత్రిక. 

పవన్ కల్యాణ్ సనత్ నగర్ నుంచి బరిలో దిగాలని ప్లాన్ చేస్తున్నారని ఓ ప్రముఖ దినపత్రిక కథనం ఇచ్చింది. ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్.. ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరారు. ఏకంగా మంత్రి కూడా అయ్యారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చినా దాన్ని ఇంకా స్పీకర్ ఆమోదించలేదు. 

తెలంగాణలో పవన్ పాగా వేస్తారా..?


టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా తలసాని కొనసాగడం అనేక విమర్శలకు తావిస్తోంది. ఓటుకు నోటు కేసు వాదన వచ్చినప్పుడల్లా టీడీపీ తలసాని ప్రస్తావన తీసుకొచ్చి దాని తీవ్రత తగ్గిస్తోంది. ప్రధాని, రాష్ట్రపతి వంటి వారికి తలసాని ఉదంతాన్ని ఓ ఉదాహరణగా చూపి.. టీఆర్ఎస్ కొనుగోలు రాజకీయాలపై దండెత్తుతోంది. 

తలసాని రాజీనామాను ఆలస్యంగానైనా స్పీకర్ అంగీకరించకతప్పదు. అందుకే ఇక్కడ ఎప్పుడు ఉపఎన్నిక వచ్చినా పోటీ చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారట. సనత్ నగర్ పై పవన్ కన్ను పడటం ఈనాటిదేమీ కాదట. గత ఎన్నికల్లోనే ఒకవేళ తాను పోటీ చేయాల్సి వస్తే ఏ నియోజకవర్గం బెటర్ అనే కోణంలో అప్పట్లో పవన్ సర్వే చేయించుకున్నారట. అందులో ఎమ్మెల్సే సీటుకైతే సనత్ నగర్, ఎంపీ సీటైతే మల్కాజ్ గిరి బెటరని తేలిందట. అందుకే సనత్ నగర్ ఉపఎన్నిక కోసం పవన్ ఎదురు చూస్తున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: