ఇదేదో.. పొట్టకూటి కోసం.. లేదా నాలుగు రాళ్లు వెనకేసుకోవడం కోసం.. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వారికి సంబంధించిన వార్త కాదు. అలాంటి వారి గురించిన విమర్శ కూడా కాదు. తమ తమ వ్యాపారాలను భారత్‌లోనే కలిగిఉంటూ.. సంపద బాగా ముదిరిన తర్వాత.. స్థిర నివాసానికి మాత్రం విదేశాలను ఎంచుకుంటున్న వారికి సంబంధించిన వార్త. ఉద్యోగాలు, వ్యాపారాలకోసం విదేశాలకు వెళ్తున్న వారు.. జీవితంలో ఒక దశ దాటిన తర్వాత.. తిరిగి స్వదేశానికే వస్తున్నారు. ఇన్నాళ్లు తమను తీర్చిదిద్దిన దేశానికి ఏదో ఒకటి చేయాలని ఉబలాటపడుతున్నారు. కానీ.. సంపన్నుల తీరు మాత్రం ఇందుకు రివర్సుగా కనిపిస్తోంది. 


ఆర్జనకోసం కాకుండా.. జీవితాన్ని అనుభవించడం కోసం ఇతర దేశాలకు వలసవెళ్లిపోయే.. ధనికుల విషయంలో ప్రపంచంలోనే భారత్‌ రెండోస్థానంలో ఉందన్నది చాలా చేదు వాస్తవం. ప్రథమ స్థానంలో చైనా ఉంది. గత పద్నాలుగేళ్లలో 61 వేల మంది భారతీయ సంపన్నులు.. ఇక్కడ బాగా సంపద ఆర్జించిన తర్వాత.. విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఇందుకు వారు.. పన్నులు, భద్రత, పిల్లల విద్యాభ్యాసం వంటి కారణాలు చెప్పుకుంటున్నారు. న్యూవరల్డ్‌, ఎల్‌ఐవో గ్లోబల్‌ లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అదే చైనీయులు 91 వేల మంది అలా వెళ్లిపోయారుట. ఇలా విదేశాలకు వలస వెళ్తున్న వారు.. అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, యుఎఇల్లో ఉంటున్నారుట. సొంత దేశాల్లో అంతర్గత పోరాటాలు, భద్రత లోపాలు, సంపదపై పన్నులు అధికంగా ఉండడం వలన ఇలా జరుగుతున్నట్లు అంచనా. మన తర్వాతి దేశాల్లో ఫ్రాన్స్‌, ఇటలీ, రష్యా ఇలా ఉన్నాయిట. 


అప్పుడెప్పుడో వంద ఏళ్ల కిందట బ్రిటిషు పాలకులు.. మన దేశంలో సంపదనంతా కొల్లగొట్టి.. లండను తీసుకెళ్లి పోయేవారంటూ.. మనం కుమిలిపోయాం. పోరాడి వారిని వెళ్లగొట్టాం. ఇప్పుడు ఇక్కడనే అంటే మన దేశంలోని వనరులనుంచే తమ తమ సంపదను సృష్టించుకున్న మెగా మిలియనీర్లు వేల సంఖ్యలో... తమతమ వ్యక్తిగత జీవితాలను అనుభవించడానికి మాత్రం విదేశాలకు వెళ్లి స్థిరపడుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వారిని ఎలా తరిమికొట్టాలి? 



మరింత సమాచారం తెలుసుకోండి: