భారతదేశం గర్వించదగినటువంటి అణ్వస్త్ర శాస్త్రవేత్త, భారత రాష్ట్రపతిగా కూడా నిరుపమాన సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్‌ ఏపీజె అబ్దుల్‌ కలాం హఠాన్మరణానికి గురయ్యారు. ఆయన షిల్లాంగ్‌లోని ఐఐఎం లో సోమవారం నాడు ప్రసంగిస్తూ.. హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.


డాక్టర్‌ అబ్దుల్‌ కలాం.. రాష్ట్రపతిగా పదవివిరమణ చేసిన తర్వాత.. తనను మాజీ రాష్ట్రపతిగా గుర్తించడం కంటె ఒక ప్రొఫెసర్‌గా గుర్తించడాన్నే ఎక్కువగా ఆస్వాదిస్తానని ప్రకటించిన వ్యక్తి. అటామిక్‌ సైన్స్‌లో కలాం కు ఉన్న పట్టు అపరిమితమైనది. భారత కీర్తి ప్రతిష్టలను, యుద్ధ సంపత్తిని పెంచే అనేక ఆయుధాల, క్షిపణుల రూపకల్పనలో అబ్దుల్‌ కలాం పాత్ర ఉన్నది. ఆయన రాష్ట్రపతిగా మాజీ అయిన తర్వాత.. గౌరవ ప్రొఫెసర్‌గా యూనివర్సిటీలో జాయిన్‌ అయ్యారు. 


అప్పటినుంచి వివిధ విద్యాసంస్థలకు పర్యటిస్తూ.. విద్యార్థులను ఉద్దేశించి కీలక ప్రసంగాలు చేస్తూ.. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తూ వస్తున్నారు. 
ఆయన తాజాగా సోమవారం నాడు షిల్లాంగ్‌లోని ఐఐఎం లో ప్రసంగిస్తూ ఉండగా.. ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. వెంటనే ఆయనను హుటాహుటిన షిల్లాంగ్‌లోని ఒక ప్రెవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనను అక్కడి ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. గుండెపోటుతో కలాం.. ఆస్పత్రిలో చేరినట్లుగా వైద్యులు ప్రకటించారు.  ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే కలాం మరణించారు. ఆయన వయసు 84 ఏళ్లు. రామేశ్వరంలో ఆయన జన్మించారు. ఆయన బ్రహ్మచారి. తన జీవితాన్ని మొత్తం ఫిజిక్స్ పరిశోధనలకే ఆయన అంకితం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: