తెలంగాణ కాంగ్రెసు పార్టీలో ఉన్న లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తెలంగాణ లోని ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలి... రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయాల గురించి చర్చించడానికి తెలంగాణ కాంగ్రెస్‌ సీఎల్పీ ఆదివారం నాడు సమావేశం అయినప్పుడు.. ప్రభుత్వంపై పోరాటం సంగతి దేవుడెరుగు.. పార్టీలో ఉన్న ఇంటిపోరును మాత్రం దాచిపెట్టుకోలేకపోయారు. సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ఏకంగా ఇతర నాయకుల మీద అలిగినంత పనిచేశారు. సమావేశంలో కొందరు ఆయనను తప్పుపట్టినట్లుగా మాట్లాడడంతో ఆయనకు కోపం వచ్చింది. మీరు ముందుండి పోరాడండి.. నేను వెనక ఉంటా.. అంటూ ఆయన తన అలను ప్రదర్శించారు. 


ఇటీవలి కాలంలో జానారెడ్డి పార్టీ మారుతారనే పుకార్లు కూడా వచ్చాయి. వీటిమీద ఆయన మనస్తాపం చెందారు కూడా. ఢిల్లీకి నాయకులు వెళ్లి అధిష్ఠానం పెద్దలను కలిస్తే.. జానారెడ్డి పార్టీలోనే ఉంటున్నారా.. వెళ్లిపోతున్నారా.. అని రాహుల్‌ గాంధీ ఎంక్వయిరీ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి ప్రచారాన్ని కావాలని పనిగట్టుకుని పార్టీలోనే కొందరు నాయకులు తనకు వ్యతిరేకంగా నడిపిస్తున్నారనేది జానారెడ్డి అభిప్రాయంగా ఉన్నది. జానారెడ్డి నేతృత్వంలో సీఎల్పీ అధికార తెరాస మీద బలంగా పోరాడడం లేదనే అభిప్రాయాన్ని కూడా విస్తృతంగా పార్టీ వర్గాల్లో వ్యాపింపజేశారు. 


ఆదివారం నాటి సీఎల్పీ భేటీలో కూడా.. ఇలాంటి చర్చ మొదలైనట్లు సమాచారం. జానారెడ్డి ప్రభుత్వం పట్ల మెతగ్గా వ్యవహరిస్తున్నారనే అంశం చర్చకు రాగానే.. ఇక జానారెడ్డి ఉండబట్టలేకపోయినట్లు తెలుస్తోంది. మీరు ముందుండి పోరాడండి... నేను మీ వెనుక ఉండి మద్దతిస్తాను. అంతే తప్ప నా స్థాయికి తగని విధంగా మాత్రం మాట్లాడలేను అంటూ జానారెడ్డి కటువుగనే చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనకు మద్దతుగా కొందరు, ఆయనను తప్పుపట్టేలా కొందరు మాట్లాడారు. 


ఇంతకూ తీర్మానం ఏంటంటే.. టీపీసీసీ నాయకులు అందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో ఒకే గళం వినిపిస్తూ ముందుకు సాగాలని.. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో మాట్లాడకూడదని నిర్ణయించారు. అయితే.. ఈ నిర్ణయం కోసం ఏర్పాటుచేసిన సమావేశంలోనే నాయకుల మధ్య అనైక్యత ఏ రేంజిలో ఉన్నదో బయటపడిపోవడం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: