ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు హైదరాబాద్‌లో చాలా ఓట్లకు కోత పెట్టాలని కోరికగా ఉన్న మాట వాస్తవం. ఆంధ్రప్రాంతానికి చెందిన అనేకమంది.. ఆ రాష్ట్రంలో ప్రయోజనాల కోసం ఆధార్‌ను అక్కడి చిరునామాతో కలిగి ఉండి... ఓటు హక్కు మాత్రం హైదరాబాద్‌లో పెట్టుకున్నారని.. ఇలాంటి వారివల్ల తెలుగుదేశానికి అనుకూలత పెరుగుతుందనేది ఆయన అనుమానం. అందుకే .. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారత్‌తో ఓటుహక్కును అనుసంధానం చేసుకోవాల్సిందే నని ఆయన ఇటీవలి హూంకరించారు. ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో కూడా ఇదే విషయం మాట్లాడారు. అయితే కేసీఆర్‌ కల నెరవేరేలా కనిపించడం లేదు. ఎన్నికల సంఘం తక్షణం ఓట్లను తొలగించే ఉద్దేశంతో లేకపోవడమే అందుకు కారణం. 


హైదరాబాదు నగరంలో ఇలాంటి ''తొలగించవలసిన ఓట్లు'' సుమారు 15 లక్షల వరకు ఉంటాయనేది కేసీఆర్‌ అంచనా. ఇలాంటి ఓట్ల వలన యావత్తు రాష్ట్ర పరిపాలన మీద ప్రభావం పడిపోతున్నదని ఆయన ఆవేదన కూడా వ్యక్తంచేశారు. ఆధార్‌తో అనుసంధానం తప్పదని చెప్పారు. భన్వర్‌లాల్‌కు కూడా ఈమేరకు సూచనలు చేశారు. 


అయితే భన్వర్‌లాల్‌ స్పందన మాత్రం.. కేసీఆర్‌లోని ఆవేశానికి తగినట్లుగా లేదని పలువురు భావిస్తున్నారు. ఆయన తాజాగా ఒక ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో హైదరాబాదు నగర ప్రజలతో మాట్లాడుతూ.. ఆధార్‌తో అనుసంధానం లేకపోయినంత మాత్రాన ఓటర్ల జాబితానుంచి తొలగించడం అనేది ప్రస్తుతానికి లేదని తేల్చిచెప్పారు. 


దేశంలో ఇప్పటిదాకా ఆధార్‌కార్డుల జారీ నూరుశాతం పూర్తికానేలేదని చెప్పారు. అలా జరిగిన తర్వాత ఇలాంటి నిబంధన రావొచ్చునని చెప్పారు. ఆధార్‌ల నమోదు నూరుశాతం చేయడానికి ప్రత్యేక డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 15 లక్షల మందికి ఆధార్‌ లేదని వెల్లడించిన భన్వర్‌లాల్‌.. ప్రస్తుతానికి ఓటర్ల తొలగింపు జరగదని తేల్చేయడం జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో చాలామంది ఓటర్లకు, కొన్ని పార్టీలకు ఊరట కలిగించే అంశం. అయితే కేసీఆర్‌ కు మాత్రం ఈ నిర్ణయం చేదుగానే ధ్వనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: