ఒక ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు సహజంగా అధికార దండం ఎవరి చేతిలో ఉంటే వారిదే పైచేయి అవుతుంది. పంటికింద రాయిలాగా మారిన అధికారిని బదిలీచేసేసి.. ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా అదే పని చేశారు. నిజానికి తానే ఇష్టపడి తెచ్చుకున్న అధికారే అయినప్పటికీ.. తన మాట ఖాతరు చేయకుండా, తాను చెప్పే ప్రణాళికలకు లోపాలు వెతుకుతూ.. వ్యవహరిస్తున్నందుకు ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి బదిలీ తప్పలేదు. సదరు అధికారి ఒక్కడి తీరు వల్ల.. రాజధాని నిర్మాణం పేరిట అమరావతి వ్యవహారంలో తాను అనుసరించే ఒంటెత్తు పోకడల పట్ల ప్రజల్లో అనుమానాలు కలుగుతాయనే భయం.. చంద్రబాబును ఈ నిర్ణయానికి పురిగొల్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకూ ఆ అధికారి కేంద్ర సర్వీసులనుంచి ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన ఐఏఎస్‌ గిరిధర్‌. 


చంద్రబాబునాయుడు ఆయనను తొలుత సీఎం కార్యాలయంలోకే తీసుకున్నారు. కానీ ఆ తర్వాత.. ఆయనను మునిసిపల్‌ శాఖకు బదిలీచేశారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగ పదవిలో ఉన్నప్పటికీ.. గిరిధర్‌కు ప్రభుత్వానికి పొసగలేదని చాలా పుకార్లు వచ్చాయి. నిజానికి రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ ఆయన పర్యవేక్షణలో జరగాల్సి ఉన్నప్పటికీ ఆచరణలో అలా జరగలేదు. అమరావతి ప్రాంతానికి ఇన్‌చార్జిగా ఉన్న అధికార్లతోను ఆయనకు పొసగలేదని పుకార్లు వచ్చాయి. అమరావతి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పోకడల పట్ల సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన గిరిధర్‌కు అభిప్రాయ భేదాలు ఉన్నాయని, అందుకే చంద్రబాబు ఆయనను పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి. 


ఈ నేపథ్యంలో అమరావతి విషయంలో అత్యంత కీలకమైన జపాన్‌ టూర్‌కు కూడా గిరిధర్‌ వెళ్లలేదు. దానికంటె ముందునుంచే ఆయన తన విధులకు సెలవు పెట్టేశారు. ఇక పురపాలక శాఖ వ్యవహారాల్లో కలిగించుకోవడం మానేశారు. సింగపూర్‌ బృందం వచ్చి నగర ప్లాన్లు సమర్పించిన ఏ సందర్భంలోను పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కనిపించనే లేదు. ఇటీవలే ఆయన సెలవు అయిపోయిన తర్వాత కూడా దానిని పొడిగించారే తప్ప తిరిగి విధులకు హాజరు కాలేదు. దీంతో పుష్కరాలనుంచి తిరిగి వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా చంద్రబాబు, వివాదాస్పదంగా మారుతున్న ఐఏఎస్‌ అధికారి గిరిధర్‌ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేశారు. పురపాలక శాఖనుంచి తప్పించి.. ఆయనను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ భర్తీచేయలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: