తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడు, కాంబినేషన్లు అన్నీ సక్రమంగా కుదిరితే.. తెలంగాణకు ముఖ్యమంత్రి కాదగినంతటి సీనియారిటీ అర్హతలు ఉన్న నాయకుడు.. జానారెడ్డి సీఎల్పీ నాయకుడిగా ఉన్న తన పదవిని త్యజించడానికి సిద్ధపడుతున్నారా? పార్టీలో లుకలుకలు.. తన సహచర పార్టీ ఎమ్మెల్యేలే తనకు వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తూ ఉండడం... అధిష్ఠానం వద్ద తనను బద్‌నాం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం, వెనుక గోతులు తవ్వుతూ ఉండడం.. ఇలాంటి పరిణామాలు ఆయనలో వైరాగ్యాన్ని పెంచినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను పార్టీ మారిపోతున్నానంటూ అధినేత వద్దనే దుష్ప్రచారం చేసే స్థాయికి.. వెళుతున్నారంటే.. ఈ సీఎల్పీ పదవిని వదులుకోవడమే ఉత్తమం అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 


జానారెడ్డి సీనియర్‌ రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్‌ కాలంనుంచి మంత్రి పదవులు వెలగబెట్టినంతటి సీనియర్‌. కాంగ్రెసు పార్టీలో కూడా ఎవ్వరితోనూ తగాదాలు ఉండని నాయకుడుగా ఆయనకు గతంలో కూడా పేరుంది. కీలకశాఖలనే గత ప్రభుత్వాల్లో నిర్వహిస్తూ వచ్చారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలోనే.. తెలంగాణకు చెందిన ఒక నాయకుడిని సీఎం ను చేయడం ద్వారా ఉద్యమాన్ని కాస్త తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆలోచించినప్పుడు ప్రధానంగా ప్రాబబుల్స్‌గా వినిపించిన పేర్లలో జానారెడ్డి ది మొదటిపేరే. ఎప్పటికైనా తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాననే నమ్మకం ఆయనలో పుష్కలంగా ఉండేది. ముఖ్యమంత్రి అయితే ప్రమాణస్వీకారానికి వేసుకోవడానికి తాను ఒక కొత్త బంద్‌గలా సూటు కూడా కుట్టించానని ఆయన సరదాగా సన్నిహతుల్తో అంటుండేవారు కూడా. 


కాంగ్రెసు గత సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రతిపక్ష స్థానంలోకి మారగానే.. సీఎల్పీ నాయకత్వం మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ప్రధానప్రతిపక్ష నేత హోదా కోసం ఆరాటపడ్డారు. అయితే సీఎల్పీ నాయకత్వం సీనియర్‌ అయిన జానా నే వరించింది. అప్పటినుంచి ఆయనకు వ్యతిరేక కోటరీ కూడా చురుగ్గా పనిచేయసాగింది. సీఎల్పీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం లేదని పదేపదే అనడం ద్వారా.. అసలు టీకాంగ్రెస్‌ నాయకులు సరిగ్గా పనిచేయడం లేదనే అభిప్రాయాన్ని అధిష్టానానికి కలిగించడంలో కొందరు సఫలం అయ్యారు. జానారెడ్డి పార్టీ మారిపోతారనే ప్రచారం కూడా జరిగింది. ఇటీవలి సీఎల్పీ సమావేశంలో కూడా కొందరు నాయకులు జానారెడ్డి ప్రభుత్వం పట్ల మెతగ్గా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. వీటిపట్ల కినుక వహించిన ఆయన ఏకంగ సీఎల్పీ పదవినే వదులుకోవడానికి నిర్ణయింకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలనుంచే తప్పుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లుగా ఆయన గతంలో కొన్ని సందర్భాల్లో అన్నారు. అయితే పదవి పట్ల వైరాగ్యం ఆయనలో ఇప్పటికే ప్రవేశించినట్లున్నదని పలువురు అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: