ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని పునర్‌వ్యవస్థీకరించి మరింత ఉత్తేజితంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఆరాటం పార్టీ అధిష్ఠానంలో కనిపిస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా.. పార్టీకి కొత్త లుక్‌ తీసుకురావాలని... ప్రజల్లో తమ పార్టీని అభిమానించే సామాజిక వర్గాల వద్దకు మరింత చేరువగా తీసుకువెళ్లాలనేది ప్రధానంగా అధిష్ఠానం వ్యూహంగా ఉన్నది. ఆ మేరకు ప్రత్యేకంగా కాపు, ఎస్సీ వర్గాలనుంచి మాత్రమే ఈసారి కాబోయే పీసీసీ చీఫ్‌ ఉంటారని పార్టీ నాయకులే చెబుతున్నారు. కులాల సమతూకానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీ కి మేలు జరుగుతుందని వారు అంటున్నారు. 


మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసేసి.. కాంగ్రెసులో కలిపేసిన తర్వాత.. రాష్ట్రంలో ఆయనకు అండగా నిలిచిన కాపులంతా.. తమ పార్టీకే మద్దతిస్తారని కాంగ్రెసు పార్టీ ఆశించింది. కానీ అలా గంపగుత్తగా కాపుల మద్దతు వారికి ఊహించినట్లుగా దక్కలేదు. పైగా కాంగ్రెసు పార్టీకి సాంప్రదాయంగా ఉన్న ఎస్సీల మద్దతులోనూ చీలిక వచ్చేసింది. కాపుల మద్దతును పంచుకోవడంలో అన్ని పార్టీలు పోటీపడగా, ఎస్సీల మద్దతు గరిష్టంగా క్రిస్టియన్‌ ముద్ర ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కు లాభించింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో పార్టీ పునర్నిర్మాణం అంటే.. ఈ రెండు వర్గాలను తిరిగి అక్కున చేర్చుకోవాలన్నది వారి వ్యూహం. మొన్నటికి మొన్న రాహుల్‌గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు.. పార్టీ నేతల సమావేశం సందర్భంగా.. ఇదే విషయం చర్చకు వచ్చింది. 


ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రఘువీరారెడ్డి బాగానే పనిచేస్తున్నప్పటికీ.. కాంగ్రెసునుంచి వలసల్ని కూడా నియంత్రించగల మరో నేతను చీఫ్‌ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆయన మెతకవైఖరి వలసల్ని అడ్డుకోలేకపోతున్నదని అధిష్ఠానం భావిస్తున్నది. అందుకోసం కాపు, ఎస్సీ వర్గాలనుంచే పీసీసీ నియామకాలు చేపట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని కోరడం కూడా ఆవ్యూహంలో భాగమే అంటున్నారు. మరి ఆయన తిరస్కరించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: